గరగపర్రు నిందితులను అరెస్ట్‌ చేయాలి

28 Jun, 2017 01:36 IST|Sakshi
గరగపర్రు నిందితులను అరెస్ట్‌ చేయాలి
గ్రామంలో పర్యటించిన వైఎస్సార్‌ సీపీ బృందం
- మా ఊరికి ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కూడా రానివ్వటంలేదు 
- ప్రతిపక్ష నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన దళితులు
30న గరగపర్రుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. దళితపేట చర్చిలో బాధితులతో సమావేశమై వారికి జరిగిన అన్యాయాలను అడిగి తెలుసుకుంది. అంబేడ్కర్‌ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూములు వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం లేదని బాధితులు వైఎస్సార్‌సీపీ బృందానికి వివరించారు.

ఇంట్లో పనిచేసేవారిని కూడా బహిష్కరించారని, తమతో మాట్లాడితే జరిమానాలు విధిస్తామని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యం చేసే ఆర్‌ఎంపీ డాక్టర్‌నూ రానివ్వడం లేదని, దుకాణాల వద్ద సరుకులు ఇవ్వడం లేదని, పశువులను మేపడానికీ అనుమతించడం లేదన్నారు. 
 
రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ధర్మాన
బాధితులతో సమావేశం అనంతరం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకుండా పోయిందని విమర్శించారు. చిన్నపాటి వివాదాలనూ పెద్దవిగా చేసి రాజకీయ లబ్ధికోసం చూస్తున్నారన్నారు. గరగపర్రులో సంఘటనలు, బాధితుల ఇబ్బందులను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
30,1న గోదావరి జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన
విషజ్వరాలు ప్రబలిన గిరిజన ప్రాంతాల్లో, దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగప ర్రులో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 30, జులై 1వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు. జూలై 1న తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలలో విషజర్వాలు ప్రబలిన ప్రాంతాలలో జగన్‌ పర్యటిస్తారు. వ్యాధి బారిన పడిన గిరిజనులతో ఆయన సమావేశమవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది. 
మరిన్ని వార్తలు