హోదా కోసం ఆందోళన

21 Apr, 2018 12:37 IST|Sakshi
  రైల్వేస్టేషన్‌ ముందు భిక్షాటనతో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

యూనివర్సిటీ క్యాంపస్‌ : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ విశ్వవిద్యాలయాల్లో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ వ్యవసాయ కళాశాలలో ప్రత్యేకహోదా కోసం అధ్యాపకులు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళన చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్‌డీన్‌ రమేష్‌బాబు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రత్యేకహోదా కోసం అధ్యాపకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెటర్నరీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు భాస్కర్, మహేంద్ర, వివేక్, అవినాష్‌ పాల్గొన్నారు. అలాగే పాలక మండలి సభ్యుడు కరుణానిధి, మాజీ ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. 
రాష్ట్రం కోసం భిక్షాటన
తిరుపతి అర్బన్‌: విభజన తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం, తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన మొండి తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం భిక్షాటనతో ఆందోళన చేపట్టారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొలకల మల్లికార్జున ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ ముందు మోకాళ్లపై నిలబడి భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ దైవసాక్షిగా తిరుపతిలో ఎన్నికలకు ముందు 2014లో ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన స్వార్థ రాజకీయాలకు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. శుక్రవారం తన పుట్టిన రోజు నిరాహారదీక్ష అంటూ రాష్ట్ర ప్రజలను మోసకారితనంతో నమ్మించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు యార్లపల్లి గోపి, నైనారు శ్రీనివాసులు, పీసీసీ అధికార ప్రతినిధి దొడ్డారెడ్డి రాంభూపాల్‌రెడ్డి, వెంకట నరసింహులు, పాఠకం వెంకటేష్, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు