మొలాసిస్‌తో మోదం

7 Aug, 2013 00:37 IST|Sakshi
 చక్కెర ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. మూడు నెలల వ్యవధిలో ధర రెట్టింపయింది. డిస్టలరీ యూనిట్లతో పాటు మొలాసిస్ అనుబంధ రంగాల్లో దీని వాడకం బాగాపెరగడంతో అమాంతం ధరలు ఆకాశాన్నంటాయి. దీని అమ్మకాలతో జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు ఈ ఏడాది సుమారు రూ. 6 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సుగర్స్ యాజమాన్యాల్లో ఉత్సాహం వెలువెత్తుతోంది. పంచదార ధర తగ్గిపోయిందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న తరుణంలో మొలాసిస్ ధరలు భారీగా పెరగడం కలిసొచ్చింది.
 
 గత మూడేళ్లతో పోల్చుకుంటే భారీ మొత్తంలో లాభం రావడం ఇదే మొదటి సారి. చోడవరం, ఏటికొప్పాక, తాండవ,తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాల్లో చోడవరం, ఏటికొప్పాక మిన హా మిగిలిన రెండు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచదార ధర క్వింటా రూ.2950 లోపే అమ్ముడుపోవడంతో బాగా నష్టపోయాయి. బహిరంగ వేలంలో సీల్ టెండర్ల ద్వారా మొలాసిస్ అమ్మకాలతో మంచి ధర వచ్చింది. గతేడాది మెట్రిక్ టన్ను రూ.900లు ధర పలికిన మొలాసిస్ ఈ సీజన్ ప్రారంభంలో రూ.2100లకు,ఏప్రిల్ నాటికి రూ.3055 నుంచి 3150లకు విక్రయించారు. ఇప్పుడు రూ. 6వేలు పలుకుతోంది. గత సీజన్‌లో చోడవరం ఫ్యాక్టరీ 27,500మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ. 3.79కోట్లు మాత్రమే వస్తే, ఈ సీజన్‌లో 23,200 మెట్రిక్ టన్నుల విక్రయంతో రూ. 6.14 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే తక్కువ సరుకు అమ్మినప్పటికీ సుమారు రూ. 2.35కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.
 
 తాండవ 98,500 మెట్రిక్ టన్నులు అమ్మి రూ.1.15 కోట్లు, ఏటికొప్పాక 15,900 మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ.1.50కోట్లు ఆదాయం పొందింది. దీనివల్ల పంచదారపై నష్టపోయినప్పటికీ మొలాసిస్ ద్వారా కొంత ఊరట కలగడంతో ఫ్యాక్టరీలు ఊపిరిపీల్చుకున్నాయి. నాలుగు కర్మాగారాలు మొలాసిస్‌ను ఒడిశా, బొబ్బిలి(ఎన్‌సీఎస్),రాజాం(రాజ్యలక్ష్మి)లకు విక్రయిస్తున్నాయి. అయితే మొలాసిస్ నిల్వకు అవసరమైన ట్యాంకులు లేకపోవడం, ఉన్నవి కారిపోతుండటంతో ఎప్పటికప్పుడు అమ్మకాలతో ఫ్యాక్టరీలు నష్టపోతున్నాయి. నిల్వ ఉంచుకున్నవి లాభపడుతున్నాయి. వచ్చే సీజన్‌నాటికయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించి పంచదార, మొలాసిస్ ఉత్పత్తిని పెంచితే అటు యాజమాన్యాలకు, ఇటు రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వ్యక్తమవుతోంది. 
 
మరిన్ని వార్తలు