4,000 వార్డు సచివాలయాలు 

10 Jul, 2019 03:35 IST|Sakshi

అంగన్‌వాడీలు, స్కూల్‌ భవనాలు,  కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు

అవి లేని చోట అందరికీ అందుబాటులో ఉండేలా అద్దెకు  తీసుకోవాలని ఆదేశం

వార్డు కో–ఆర్డినేటర్‌గా జూనియర్‌ అసిస్టెంట్‌ స్ధాయి ఉద్యోగి నియామకం

81 వేల మంది వార్డు వలంటీర్ల నియామకాలకు సన్నాహాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ ప్రాంతాల్లో 4,000 వార్డు సచివాలయాల ఏర్పాటుకు మున్సిపల్‌శాఖ కసరత్తు చేస్తోంది.  మరో వారం నుంచి పది రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు 81 వేల మంది వార్డు వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటవుతాయి. వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. స్థానిక అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లోని గదుల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలి. ఇవి అందుబాటులో లేని చోట ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ప్రైవేట్‌ భవనంలో ఓ గదిని అద్దెకు తీసుకోవాలి. వార్డు సచివాలయానికి ఫర్నీచర్‌ను ప్రభుత్వమే సమకూరుస్తుంది.  

కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా..  
జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. కనిష్టంగా 4 వేలు, గరిష్టంగా 6 వేలు జనాభా ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం సాలీనా 1.098 శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జనాభా ఐదు వేల కంటే అధికంగా ఉంటే అదనంగా మరో వార్డు సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి కంటే జనాభా తక్కువగా ఉంటే సమీప వార్డు సచివాలయానికి జత చేస్తారు. వార్డు సచివాలయాలను నిర్ణయించే సమయంలో మురికివాడల సరిహద్దులు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్డు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మున్సిపల్‌ కమిషనర్లు టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సాయంతో మ్యాప్‌ రూపొందించి సీరియల్‌ నంబర్లు కేటాయిస్తారు.  వార్డు వలంటీర్లు స్థానిక పరిస్థితులు, సమస్యలపై వార్డు సచివాలయానికి రోజూ నివేదిక ఇవ్వాలి. వార్డు   కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి తగ్గకుండా ఉండాలని నిర్దేశించారు. వీరిని మున్సిపల్‌ కమిషనర్‌ నియమిస్తారు.  

విధులు, బాధ్యతలు ఇవీ... 
ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చేలా వార్డు వలంటీర్లు కృషి చేయాలి. దీన్ని నిర్ధారించుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తారు. విధుల నిర్వహణలో అలక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సచివాలయాల్లోని కో–ఆర్డినేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా వలంటీర్‌పై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి.  

1.70 లక్షలకు చేరుకున్న దరఖాస్తులు  
పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్ల పోస్టులకు మంగళవారం సాయంత్రానికి 1.70 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం వీరి విద్యార్హతలను డిగ్రీ నుంచి ఇంటర్‌కు  తగ్గించడంతోపాటు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వార్డు వలంటీర్, ఇతర ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించాలని నిర్ణయించడంతో వీరి సంఖ్య 81 వేలకు చేరుకునే అవకాశం ఉందని   చెబుతున్నారు. 

వంద మార్కులకు ఇంటర్వూ్య

వార్డు వలంటీర్ల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వూ్యల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 మార్కులు, బీసీ, ఓసీ అభ్యర్థులకు 40 మార్కులు చొప్పున వస్తే వారిని అర్హులుగా ప్రకటించనున్నారు. ఈమేరకు నియామక అర్హతలపై మున్సిపల్‌ శాఖ మంగళవారం ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. వంద మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వూ్యలో ఒక్కో విభాగానికి 20 మార్కులు చొప్పున ఐదు విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. చైర్మన్‌తోపాటు మరో ఇద్దరు సభ్యులు ఇంటర్వూ్యలను నిర్వహిస్తారు. వేర్వేరుగా మార్కులు నిర్ణయించి అనంతరం ఎంపిక కమిటీ చైర్మన్‌ వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని అర్హులను ప్రకటిస్తారు. అభ్యర్థి ప్రధానంగా అదే వార్డుకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వర్తమాన రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. గతంలో ప్రభుత్వ సంస్థల్లో, ఎన్జీవోల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌లు నోటీసు బోర్డులో పొందుపరచాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించింది.  

మరిన్ని వార్తలు