గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం

21 Jun, 2015 01:33 IST|Sakshi
గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం

- ప్రజాసేవకులకే పార్టీ గుర్తింపు  
- విజయపథమే ముందున్న లక్ష్యం
- శ్రేణులకు త్వరలో శిక్షణా తరగతులు
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
అల్లిపురం (విశాఖపట్నం) :
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. నగర వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నామన్నారు. అనుభవజ్ఞులతో ఈ శిక్షణ ఇస్తారన్నారు. ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై తర్ఫీదునిస్తారన్నారు. ఇప్పటికే నగరంలో కార్యవర్గ సభ్యులను నియమించినట్లు చెప్పారు. వీరందరి సేవలను పార్టీ విజయానికి వినియోగించుకుంటామన్నారు.

భవిష్యత్‌లో నియామకమయ్యే వారి సేవలను కూడా వినియోగించుకుంటామన్నారు. పార్టీలో సేవచేసి, ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించి మన్ననలు పొందేవారికే టికెట్టు ఇవ్వటం జరగుతుందని స్పష్టం చేశారు. విజయావకాశాలే ప్రధానమన్నారు. గ్రేటర్ విశాఖను కైవసం చేసుకోవడానికి దీటైన అభ్యర్థులను దించుతామన్నారు. ప్రజాసేవకులకే పెద్ద పీటవేస్తామన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షుడు సమావేశమై నిర్ణయం తీసుకుంటారన్నారు.ప్రజా సమస్యలపై విద్యార్ధి , మహిళ, యువజన, కార్మిక విభాగం అధ్యక్షులను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల సందర్బంగా జులై 5,6,7 తేదీల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయనతెలిపారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితి దొంగే దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. ఓటు నోటు తీరుపై ఆయన వైఖరిని తూర్పారబెట్టారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం మాట్లాడుతూ  ఇప్పటికే ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.

దీనిని సానుకూలంగా మలుచుకుని ప్రచారం చేపట్టాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్తలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్, కర్రి సీతారాం, అదీప్‌రాజ్,కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్,  సత్తి రామకృష్ణారెడ్డి పార్టీ వార్డు క న్వీనర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు