డీఎడ్‌ పరీక్షలకు గ్రీన్‌ సిగ్నల్‌

16 May, 2019 11:39 IST|Sakshi
ఛాత్రోపాధ్యాయులు

ఏడు నెలలు ఆలస్యంగా నిర్వహణ

జూన్‌  3 నుంచి 10 వరకు

జిల్లాలో హాజరు కానున్న 3,200 మంది విద్యార్థులు

తగరవువలస(భీమిలి): డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌  కోర్సు విద్యార్థులకు సందిగ్ధానికి తెరదించుతూ ఎట్టకేలకు డీఎడ్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు (డీఎడ్‌) 2017–19 బ్యాచ్‌కు తొలి ఏడాది పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ని ఖరారు చేసింది. జూన్‌  3 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించేలా టైమ్‌టేబుల్‌ విడుదల చేసింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ డైట్, ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ డీఎడ్‌ కళాశాలలు జిల్లావ్యాప్తంగా 35 ఉన్నాయి. ఆయా కళాశాలల నుంచి 2017–19 బ్యాచ్‌కు చెందిన 3,200 మంది ఛాత్రోపాధ్యాయులు తొలి ఏడాది పరీక్షలకు హాజరుకానున్నారు.

ఈసారి పరీక్షలు పక్కాయేనా..!
డీఎడ్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు గతంలో విద్యాశాఖ ప్రకటించింది. అనివార్య కారణాలతో ఈనెల జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో డీఎడ్‌ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక సందిగ్ధంలో పడ్డారు. తాజాగా జూన్‌  3 నుంచి పరీక్షలను నిర్వహించేందుకు టైమ్‌టేబుల్‌ను విడుదల చేయడంతో డీఎడ్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. అయితే కొందరు విద్యార్థులకు మాత్రం ఈసారి వాయిదా పడే అవకాశం ఉండదు కదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే నిర్ధారించుకునేందుకు డైట్‌ కళాశాలకు ఫోన్లు చేసి అడిగి తెలుసుకుంటున్నారు.

చివరి అరగంటలో... బిట్‌ పేపరు...
 2017–19 బ్యాచ్‌కు కొత్త సిలబస్‌ను అనుసరించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆరు పేపర్లకు సంబంధించి అభ్యర్థులకు చివరి అరగంటలో 20 మార్కులకు బిట్‌ పేపరు ఇవ్వనున్నారు. గతంలో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఒక్కో ప్రవేశానికి రూ.2వేలు అపరాధ రుసుం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు అటువంటి అపరాధ రుసుం లేకుండానే పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగింది.

ఛాత్రోపాధ్యాయుల్లో ఆందోళన
మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న ఛాత్రోపాధ్యాయులు రెండో ఏడాది శిక్షణ గత ఏడాది అక్టోబర్‌ నుంచి పొందుతున్నారు. మరో రెండు నెలల్లో ద్వితీయ పరీక్షలకు వారు హాజరు కావల్సి ఉంది. జూన్‌  4వ తేదీతో ద్వితీయ విద్యా సంవత్సరం ముగించాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ మధుసూదనరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంచుమించుగా రెండేళ్ల పరీక్షలు రెండు నెలల తేడాతో రాయాల్సి రావడంతో ఛాత్రోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యు ల్‌ ప్రకారం పరీక్షలు జరగకపోవడంతో  ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడు నెలలు ఎదురు చూపులు
2015–17 డీఎడ్‌ బ్యాచ్‌ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు తొమ్మిది నెలలు ఆలస్యంగా 2017 ఆగస్టులో అధికారులు నిర్వహించారు. అదే విధంగా 2016–17 విద్యాసంవ త్సరానికి సంబంధించిన పరీక్షలను 2018 మే మాసంలో జరిగాయి. 2017–19 బ్యాచ్‌ విద్యార్థులకు నేటికీ నిర్వహించకపోవడంతో ఏడు నెలల జాప్యం ఏర్పడింది. వాస్తవంగా 2018 జూలై నాటికి వీరి విద్యాసంవత్సరం ముగిసింది. అప్పటి నుంచి ఈ పరీక్షలను నిర్వహిం^è  లేదు. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు సీట్లు నింపుకోవడం కోసం పరీక్షల నిర్వహణ వాయిదా వేస్తూ వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్యార్థులను సన్నద్ధంచేస్తున్నాం
నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్ధులు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా చూడాలి. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం డీఎడ్‌ ఛాత్రోపాధ్యాయులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. ప్రయివేట్‌ కళాశాలల విద్యార్థులు కూడా చక్కగా పరీక్షలు రాసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.– ఎ.టి.సిహెచ్‌.కౌశిక్, ప్రిన్సిపాల్, శ్రీబాసర డైట్‌ కళాశాల, తగరపువలస

డీఎడ్‌ పరీక్షల షెడ్యూల్‌ వివరాలు.. తేదీ పేపరు
జూన్‌ 3    చైల్డ్‌ హుడ్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ లెర్నింగ్‌
జూన్‌  4    సొసైటీ, ఎడ్యుకేషన్‌  అండ్‌ కరిక్యులమ్‌
జూన్‌  6    ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌
జూన్‌  7    పెడగాగి ఆఫ్‌ మదర్‌ టంగ్‌ ఎట్‌ ప్రైమరీ లెవల్‌
జూన్‌  8    పెడగాగి ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ ఎట్‌ ప్రైమరీ లెవల్‌
జూన్‌  10    పెడగాగి ఎక్రాస్‌ కరిక్యులమ్‌ అండ్‌ ఐసీటీ ఇంటిగ్రేషన్‌

మరిన్ని వార్తలు