పల్నాట.. ఉలికిపాటు

15 Mar, 2016 01:07 IST|Sakshi
పల్నాట.. ఉలికిపాటు

మళ్లీ వార్తల్లోకి ఎక్కిన గుత్తికొండ  
వేమగిరిలో స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్
ఆయుధాల విడిభాగాల తయారీ మిషన్లు, సామాగ్రి గుర్తింపు
నాటు తుపాకులు, 600 బుల్లెట్లు స్వాధీనం
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసు యంత్రాంగం
మావోల కదలికలపై బలపడుతున్న అనుమానాలు
పల్నాడు ప్రాంతంలో సంచలనం

 
పిడుగురాళ్ళ: గుత్తికొండ గ్రామం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొన్నేళ్లుగా కనుమరుగైన నక్సలిజం కదలికలు మళ్లీ మొదలైన జాడ కనిపిస్తోంది. మావోయిజానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే... అదే మావోయిజానికి బీటలు వారింది ఇక్కడే... పిడుగురాళ్ళ మండలంలోని ఈ గ్రామ సమీపంలోనే వేమగిరి అటవీ ప్రాంతంలో సోమవారం ఆయుధాలు తయారు చేసే మిషనరీతో పాటు పలు సామాగ్రి ఉన్న బాక్సులు లభ్యం కావడంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ ఆయుధాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.  నక్సలైట్లు వాడే ఆయుధాలను, తూటాలను తయారు చేసే  మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న నలుగురైదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు ప్రత్యేక వాహనాల్లో పిడుగురాళ్లకు తరలించారు. మిషనరీతోపాటు, నాటు తుపాకులు, 600 బుల్లెట్లు, తూటాలుతయారు చేసే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మిషనరీ పవర్ స్ప్రేయర్లు తయారు చేసేదని తయారీదారులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
 
 నక్సలిజానికి పెట్టింది పేరు గుత్తికొండ..

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నక్సలైట్లు కీలక విభాగాల్లో పనిచేశారు. గతంలో గుత్తికొండ ప్రాంతంలో నక్సలైట్లు పలువురు రాజకీయ నాయకులను, ఇన్‌ఫార్మర్లను హత్య చేశారు. తదనంతర పరిణామాల్లో పోలీసులు మావోయిస్టులను అణచివేసే కార్యక్రమంలో భాగంగా నక్సలైట్ల ప్రభావం తగ్గింది. నక్సలైట్లు వారి సాధక బాధకాలు చర్చించుకునేందుకు పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామానికి వేదిక చేసుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు.

దీంతో నక్సల్స్ ఆయువు పట్టును ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు చేజిక్కించుకున్నాయి. ఈ బహిరంగ సభకు సంబంధించి ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు ఫొటోలు, వీడియోలు తీసి పక్కా సమాచారాన్ని సేకరించింది. దీంతో పోలీసులు నక్సలిజానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నక్సలిజం జాడ లేదు. ప్రస్తుతం గుత్తికొండ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం ఓ కన్నేసింది. అక్కడ ఎలాంటి కదలికలు ఉన్నా సునిశితంగా పరిశీలిస్తోంది. దీంతో సోమవారం పోలీసుల కూంబింగ్‌లో ఆయుధాల విడిభాగాలు తయారు చేసే మిషనరీ బయట పడటం పల్నాడులో చర్చనీయాంశమైంది. మళ్లీ పల్నాడులో ఇప్పుడిప్పుడే నక్సలైట్ల కదలికలు మొదలవుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది.  
 
 కూపీ లాగుతున్న పోలీసులు..

గతంలో గుత్తికొండ తరచూ వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలో తుపాకులు తయారు చేస్తున్న సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. పవర్‌స్ప్రేయర్లు తయారు చేసే మిషన్లను తయారీదారులు చెబుతున్నప్పటికీ ఈ మిషన్లను ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎందుకు పెట్టారు.. తపంచాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారా అనే కోణంటో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇవి నక్సలైట్ల ఉద్యమానికి సహకరించడానికా, లేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి రౌడీ మూకలు చేస్తున్న పనా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు