సంక్షేమశకం ఆరంభం

21 Nov, 2019 09:21 IST|Sakshi

వైఎస్సార్‌ నవశకం ద్వారా ఐదు రకాల కొత్త కార్డులు

జిల్లాలో 25 వేల మందికిపైగా వలంటీర్లతో ఇంటింటి సర్వే  

ఒక్కొక్క వలంటీరు రోజుకు ఐదు ఇళ్లు సర్వే చేసేలా ప్రణాళిక 

సర్వే వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు 

డిసెంబరు 20 నాటికి లబ్ధిదారుల జాబితా 

సాక్షి, గుంటూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ఐదు రకాల కార్డులు, ఏడు కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, వార్డు వలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పారదర్శకంగా సర్వే, సామాజిక తనిఖీ, గ్రామ సభల ద్వారా వంద శాతం సంతృప్తి స్థాయిలో అర్హుల గుర్తింపుతో వైఎస్సార్‌ నవశకానికి నాంది పలకనుంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాం. ఇప్పటికే వలంటీర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పనిని పూర్తి చేస్తాం’ అంటూ కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ చెప్పారు. బుధవారం ఆయన వైఎస్సార్‌ నవశకంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సాక్షి : ఇంటింటి సర్వే ఎలా సాగనుంది? 
కలెక్టర్‌ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ నవశకం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు సమగ్ర సర్వే నిర్వహిస్తాం. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా 16 వేల మంది గ్రామ వలంటీర్లకు, 
9 వేల మంది వార్డు వలంటీర్లకు శిక్షణ ఇప్పించాం. బుధవారం సాయంత్రం నుంచి సర్వే ప్రారంభమయ్యింది. 

సాక్షి : కొత్తగా ఎన్ని రకాల కార్డులు ఇస్తున్నారు? వాటి ఎంపికలు ఎలా జరుగుతాయి? 
కలెక్టర్‌ : జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు, పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాం. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుమానాలు వ్యక్తమైతే సంబంధిత డిపార్టుమెంట్‌ అధికారులను పంపి, వివరాలను పరిశీలించి చేసి అర్హత ఉందో లేదో మరోసారి నిర్ధారిస్తాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. 

సాక్షి :  ప్రభుత్వం కొత్తగా ఏయే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది? 
కలెక్టర్‌ : ప్రభుత్వం ప్రధానంగా జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ మత్య్సకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్‌ కాపు నేస్తం, టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులకు సంక్షేమ పథకాలు, ఇమామ్, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలు వర్తింపజేసేందుకు అర్హుల జాబితాలను  సిద్ధం చేయనున్నాం. 

సాక్షి : అమ్మఒడికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలు, చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు? 
కలెక్టర్‌ :  జిల్లాలో అమ్మఒడికి పథకానికిసంబంధించి ఇప్పటికే 6.82 లక్షల మంది విద్యార్థులు ఉండగా, చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాని వారు చాలా తక్కువ సంఖ్యలో (దాదాపు పది వేలలోపు) మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయా పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలు అమ్మఒడి విరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తాం. 

సాక్షి : సర్వే ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారు? 
కలెక్టర్‌ :  వైఎస్సార్‌ నవశకంలో భాగంగా నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. డిసెంబర్‌ 9వ తేదీ నాటికి అర్హుల జాబితాను ప్రచురిస్తాం. జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సూచనలను డిసెంబర్‌ 10 నుంచి 12వ తేదీ వరకు స్వీకరిస్తాం. డిసెంబర్‌ 13 నుంచి 16వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా పార్టీలకతీతంగా వంద శాతం సంతృప్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఎంపికైన వారి జాబితాను శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో ప్రదర్శిస్తాం. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నాటికి కొత్త కార్డులను జారీ చేస్తాం.  

సాక్షి : సర్వే ఏర్పాట్లు ఎలా చేశారు? 
కలెక్టర్‌ : జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించేందుకు వీలుగా ఆయా శాఖల అధికారులు, జాయింట్‌ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశాం. వైఎస్సార్‌ నవశకం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. 

సాక్షి :గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయా? 
కలెక్టర్‌ : ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను సైతం భర్తీ చేసి పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తాం.  గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకనుగుణంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. 

మరిన్ని వార్తలు