ఎందుకీ వివక్ష..?

7 Mar, 2016 03:30 IST|Sakshi
ఎందుకీ వివక్ష..?

పేదల పెద్దాస్పత్రిపై ప్రభుత్వం శీతకన్నుస్టాఫ్ నర్సుల నియామకంలో తీవ్ర పక్షపాతం
పడకలు ఎక్కువ.. నర్సింగ్ స్టాఫ్ తక్కువజీజీహెచ్‌తో పోల్చితే నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లోనే అధికం
తాజాగా విడుదల చేసిన కాంట్రాక్ట్  పోస్టుల్లోనూ అన్యాయం  పట్టించుకోని  అధికార పార్టీ  జిల్లా ప్రజాప్రతినిధులు
నేతల తీరును తప్పుపడుతున్న జిల్లా ప్రజలు

 
 సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలో ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిపై ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. పడ కల సంఖ్యకు తగినంతగా స్టాఫ్ నర్సుల నియామకం లేకపోవడంతో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో పేదల పెద్దాస్పత్రిగా పేరు గాంచిన జీజీహెచ్‌కు అన్యాయం జరుగుతోంది.

 ఘన చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి జీజీహెచ్ 1954లో ప్రారంభమైంది. అప్పట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, రోగులకు అనుగుణంగా 183 మంది స్టాఫ్‌నర్సులను నియమించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 1177 పడకలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరో 800 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌కు కనీసం మరో 400 మంది పైగా స్టాఫ్‌నర్సులను నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దీనికి తగ్గట్లుగా నర్సింగ్ స్టాఫ్, వైద్య పరికరాలు, వసతులు లేవని పలుమార్లు తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ అధికారులకు సూచించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు.

 ఆ హామీలకు ఐదు నెలలు..
 జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో మంత్రులతోపాటు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జీజీహెచ్‌లో మూడు గంటల పాటు పలు వార్డులు పరిశీలించారు. ఆస్పత్రి సమస్యలు తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఐదు నెలలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గానీ, కొత్త పరికరాలు గానీ మంజూరు కాలేదు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అనేక మంది రోగులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కి  తరలిస్తుంటారు. జీజీహెచ్‌తో పోలిస్తే ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగం పడకలు కూడా లేవు. స్టాఫ్‌నర్సుల సంఖ్య మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల పోస్టుల్లో కేవలం 160 మందిని మాత్రమే జీజీహెచ్‌కు కేటాయించారు.

 కాంట్రాక్టు పోస్టుల్లోనూ అన్యాయం..
 నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకలకు  190 మంది స్టాఫ్‌నర్సులు ఉన్నారు. తాజాగా మంజూరు చేసిన కాంట్రాక్టు పోస్టుల్లో సైతం ఈ ఆసుపత్రికి 362 మందిని కేటాయించడం గమనార్హం. అంటే గుంటూరు జీజీహెచ్ కంటే పది మంది పర్మనెంట్ స్టాఫ్‌నర్సులు అధికంగా ఉన్నప్పటికీ కాంట్రాక్టు న ర్సులనూ 200 మందిని అదనంగా ఇచ్చారు. ఇక ఒంగోలు రిమ్స్‌లో 550 పడకలకు 234 మంది పర్మనెంట్ స్టాఫ్‌నర్సులు ఉన్నారు. అంటే జీజీహెచ్‌లో ఉన్న పడకల కంటే సగం కూడాలేని రిమ్స్‌కు 50 మంది స్టాఫ్‌నర్సులు అదనంగా ఉండటం విశేషం.
 
 ప్రజాప్రతినిధులవి ప్రగల్బాలే..
 రాజధాని ప్రాంతాన్ని, గుంటూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్బాలు పలికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జీజీహెచ్ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడిగా పర్యటించడం హామీలు గుప్పించడం మినహా ప్రయోజనం కనిపించండం లేదు. నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు తమ జిల్లాకు 362 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను తెప్పించుకోగా, ఇక్కడి వారు కేవలం 160 మందిని మాత్రమే తెచ్చుకోగలిగారు. అర్హత లేని సిబ్బందిని అందల మెక్కించడంలో ఉపయోగపడిన వీరి అధికారం ఆసుపత్రి అభివృద్ధికి ఎందుకు ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నేతలు జీజీహెచ్‌అభివృద్ధిపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
 
 ఆస్పత్రి                 పడకలు    స్టాఫ్‌నర్సుల సంఖ్య
 గుంటూరు జీజీహెచ్    1177        183
 నెల్లూరు ప్రభుత్వాస్పత్రి   500      190
 ఒంగోలు రిమ్స్             550      234

మరిన్ని వార్తలు