ప్రతిక్షణం భక్తపరవశం

20 Jul, 2015 11:15 IST|Sakshi

12 రోజుల పుష్కరపర్వంలో ఆదివారం నాటికి అర్ధభాగం పూర్తయింది. సెలవు దినం కావడంతో ప్రతి స్నానఘట్టమూ భక్తులతో కిటకిటలాడింది.


 రత్నగిరి భక్తజనఝరి:
 సత్యదేవుని ఆదివారం 1.20 లక్షల మంది దర్శించారు. రద్దీ తట్టుకోలేక రూ.100 దర్శనాలను నిలిపివేసి ఆ క్యూ ద్వారా భక్తులను పంపించారు. అయినా భక్తులు అంతకంతకూ పెరిగారు. ఒకదశలో క్యూలో తోపులాట జరిగింది. దీంతోవాహనాలను రెండు గంటలు కొండదిగువన నిలిపివేశారు. సాయంత్రం వరకూ  రూ.51.15 లక్షలు ఆదాయం సమకూరింది.
     - అన్నవరం
 సమైక్య సన్నిధి అంతర్వేది:
 తమిళనాడు, కర్నాటక, తెలంగాణల నుంచీ భక్తులు రావడంతో అంతర్వేదిలో పుష్కర ఘాట్ రోడ్డు కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచి రద్దీ కొనసాగింది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. నరసన్నను 2లక్షల మందికి పైగా దర్శించారు.
  -మలికిపురం

భీమేశ్వరా ! కావగ రారా...:
మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దర్శనాలు రాత్రి 12 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి.  సుమారు 2లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ఆలయానికి రూ.మూడు లక్షల ఆదాయం సమకూరింది.
- ద్రాక్షారామ (రామచంద్రపురం)
బాలాజీకి రూ.5.80 లక్షల ఆదాయం:
  శ్రీబాల బాలాజీని 1.25 లక్షల మంది దర్శించారు. వివిధ సేవల ద్వారా రూ.5.80 లక్షల లభించాయి. 25 వేల లడ్డూలు విక్రయించారు. అన్నదానం ట్రస్టుకు రూ.2.60 లక్షల విరాళాలు వచ్చాయి.
 - అప్పనపల్లి (మామిడికుదురు)
 
వీరేశ్వరుని సన్నిధికి భక్తుల తాకిడి:
మురమళ్ల శ్రీభధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని ఆదివారం సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఆదివారం ఆలయానికి సుమారు రూ.లక్ష ఆదాయం లభించింది.
 -ఐ.పోలవరం

కోటిపల్లి కిటకిట:
కోటిపల్లిలోని ఘాట్లలో ఆదివారం సాయంత్రానికి రెండు లక్షల మంది పుష్కర పుణ్య స్నానాలు చేశారు. శనివారం రాత్రి వర్షం పడడంతో ఘాట్ల పరిసరాలు బురదమయమయ్యాయి. బురదనీటిలో స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డ పలువురు భక్తులు జల్లుఘట్టం వద్ద స్నానానికి మొగ్గు చూపారు.  పిండ ప్రదానాల ఘాట్‌లో కాసింత చోటు దొరికితే అదే పదివేలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. పలుచోట్ల బురదలోనే కూర్చుని పిండ ప్రదానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.   
 -కోటిపల్లి (కె.గంగవరం)

మరిన్ని వార్తలు