రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం

21 Aug, 2023 03:31 IST|Sakshi

రూ.8 లక్షల వ్యయంతో సత్యదేవునికి ముత్తంగి తయారీ 

సమర్పించనున్న దేవస్థానం పురోహిత సంఘం  

అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యా­లతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది.  శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు.

అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. 

ప్రాచీన కళను కాపాడుతూ.. 
ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్‌ చరణ్‌ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడు­లోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్‌ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు.

వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్‌ చరణ్‌ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు.  

ఎలా తయారు చేస్తారంటే.. 
ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రత­తో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వర­కూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చే­సి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీ­టి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వా­మి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. 

సత్యదేవునికీ ముత్తంగి సేవ 
సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమ­వారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది.  – ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం

మరిన్ని వార్తలు