కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు

13 Aug, 2014 01:29 IST|Sakshi

రుద్రవరం: ఆరోగ్యశ్రీ కార్డులేని వారికి కూడా ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 938 రకాల జబ్బులకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తో పాటు గౌరి గోపాల్, శాంతిరామ్, క్యూర్, మెడికేర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొని పరీక్షలు నిర్వహించారన్నారు.

గతంలో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించే వారని ప్రసుత్తం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీకి అర్హులన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలు కూడా సంబంధిత తహశీల్దార్‌తో ధ్రువపత్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో రోగి వివరాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి సీఎంసీఓసెంటర్‌కు అందంజేస్తే వారికీ ఆరోగ్య శ్రీ పథకం వర్థిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116, 8333814117 నంబర్లకు పోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

 వైద్యశిబిరం విజయవంతం
 మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరం విజయవంతం అయింది. డాక్టర్లు రామశర్మ, స్వాతి(శాంతిరామ్ ఆసుపత్రి), వరకుమార్ రెడ్డి(మెడికేర్), త్రినాథ్(గౌరిగోపాల్), మైత్రీ(కర్నూలు ప్రభుత్వాస్పత్రి), డేవిడ్ రాజు(క్యూర్ ఆస్పత్రి)తోపాటు ఆయా ఆసుపత్రిలకు చెందిన వైద్య సిబ్బంది 844 మంది రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. 20 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో రుద్రవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీమంత్, సిబ్బంది, ఆరోగ్య మిత్ర సభ్యులు విజయ్, మోష పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు