అనూహ్య ఫ్రెండ్ మాత్రమే.. హత్యతో సంబంధం లేదు

4 Feb, 2014 17:12 IST|Sakshi
అనూహ్య ఫ్రెండ్ మాత్రమే.. హత్యతో సంబంధం లేదు

హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య, తాను స్నేహితులం మాత్రమేనని.. ఆమె హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమంత్ స్పష్టం చేశాడు. అనూహ్యతో కలసి తాను ఒకే రైల్లో ముంబైకి వెళ్లినట్టు వచ్చినా వార్తలు అవాస్తమమని తెలిపాడు.  మచిలీపట్నం అమ్మాయి అనూహ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ 'సాక్షి'తో మాట్లాడాడు. ఆమెతో పరిచయం నుంచి హత్యకు ముందు వరకు జరిగిన పలు విషయాల్ని వెల్లడించాడు. గత నెల 5న ముంబైలో అనూహ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

అనూహ్య హత్యకు ఓ రోజు ముందు అనగా జనవరి 4 మధ్యాహ్నం 1.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెను చివరిసారి కలిసినట్టు హేమంత్ చెప్పాడు. అనూహ్యతో కలిసే ఒకే రైల్లో వేరే కంపార్ట్మెంట్లో ముంబై వెళ్లినట్టు పోలీసులు చెప్పిన విషయం అవాస్తవమని చెప్పాడు. అదే రోజు సాయంత్రం వేరే రైల్లో షిర్డీకి ప్రయాణం చేసినట్టు చెప్పాడు. షిర్డీ ఎక్స్ప్రెస్లో వెళ్లినట్టు ఆధారాలు చూపించాడు. మరుసటి రోజు దర్శనం చేసుకుని అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చానని హేమంత్ చెప్పాడు.

కాగా సికింద్రాబాద్లో అనూహ్యను కలిసిన మాట వాస్తవమేనని, ఆ తర్వాత వెనక్కి వచ్చేశానని తెలిపాడు. కావాలంటే ఫుటేజిలో చూసుకోవచ్చని హేమంత్ చెప్పాడు. అనూహ్య బంధువుల సూచన మేరకు ముంబై వెళ్లి పోలీసులను కలిశానని తెలిపాడు. పోలీసులు రెండు రోజుల పాటు ఆరు గంటలు తనను ప్రశ్నించారని, తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానని వివరించాడు. తాను చెప్పిన సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందారని హేమంత్ తెలిపాడు. అనూహ్య రైల్లో వెళ్లిన కాసేపటికి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నామని, ఆ తర్వాత తమ మధ్య మాటలు లేవని చెప్పాడు. అనూహ్య ఇంటి నుంచి వస్తుండటంతో డిప్రెషన్లో ఉందని, అంతకుమించి ఇతర సమస్యలు, ఆందోళనలో ఉన్నట్టు కనిపించలేదని తెలిపాడు. ఆరో తేది మధ్యాహ్నం అనూహ్య హత్య గురించి తెలిసిందని హేమంత్ చెప్పాడు.

కాకినాడలో అనూహ్యతో కలిసి బిటెక్ చదవడం వల్ల ఆమెతో పరిచయం ఏర్పడిందని హేమంత్ వివరించాడు. ఏడాదిన్నరగా అనూహ్య ముంబైలో ఉద్యోగం చేస్తోందని తెలిపాడు. ముంబైలో ఆమెకు చాలామంది స్నేహితులున్నారని, అయితే వారి వివరాలు తనకు తెలియవని చెప్పాడు. తామిద్దరం ఫోన్లో తమ సంగతులు తప్ప ఇతర విషయాలు మాట్లాడుకునే వారం కాదని తెలిపాడు. అనూహ్య అంత్యక్రియల్లో తాను పాల్గొన్నానని, ఆమె కుటుంబ సభ్యులతో హత్యకు సంబంధించి చర్చించానని తెలిపాడు. వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదని, తనపై వారికి అనుమానం లేదని హేమంత్ చెప్పాడు.

మరిన్ని వార్తలు