‘హై సెక్యూరిటీ’ గందరగోళం

20 Jun, 2016 02:09 IST|Sakshi

పాత వాహనాలకు తప్పనిసరి
బోర్డుల తయారీలో నాణ్యతా లోపం
వాహనదారుల గగ్గోలు

 

 

మర్రిపాలెం : రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి తెచ్చిన ‘హై సెక్యూరిటీ’ నంబర్ బోర్డుల ప్రక్రియ తొలి నుంచి విమర్శలకు దారితీస్తోంది. మోటార్ వాహనాల చట్టంలో ప్రమాణాలను తయారీ సంస్థ పాటించడం లేదు. ధరలకు తగ్గట్టుగా బోర్డులు ఉండటం లేదు. జిల్లాలో 2014 మార్చి 10 నుంచి ై‘హె సెక్యూరిటీ’ బోర్డుల ప్రక్రియ అమలులోకి వచ్చింది. 2013 డిసెంబర్ 11 తర్వాత రిజిస్ట్రేషన్ కాబడ్డ వాహనాలకు ‘హై సెక్యూరిటీ’ తప్పనిసరి చేశారు. అన్ని తరహా పాత వాహనాలు 2015 డిసెంబర్ 15 లోపుగా బోర్డులు అమర్చుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పులో  వెల్లడించింది. గడువు ముగియడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు తెరపైకి తెచ్చింది. ఆగస్టు 31లోగా అన్ని తరహా పాత వాహనాలు ‘హై సెక్యూరిటీ’ కలిగి ఉండాలని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది.

 
వాహనదారుల గగ్గోలు

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ‘హై సెక్యూరిటీ’ని ముడిపెట్టడంతో ఇప్పటికే వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. బోర్డు ధర చెల్లించిన తరువాత రిజిస్ట్రేషన్ జరపడంతో సర్వత్రా విమర్శిస్తున్నారు. నాణ్యత లేని బోర్డులు బలవంతంగా అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో బోర్డులో అక్షరాలు చెరిగిపోవడంతో డొల్లతనం బయటపడుతోంది. హై సెక్యూరిటీ బోర్డుకు ధర చెల్లించి మళ్లీ స్టిక్కరింగ్ వ్యాపారుల వద్ద బోర్డులు కొనుగోలు చేయడం జరుగుతోంది.

 
అట కెక్కిన ముఖ్యమంత్రి ప్రకటన

‘హై సెక్యూరిటీ బోర్డు’ ప్రక్రియ అమలు సక్రమంగా జరగకపోవడంతో కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెండిటీ(ఆర్‌ఎఫ్‌ఐడీ) విధానం తెరపైకి తెచ్చింది. గతేడాది మే నెలలో రవాణా అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌ఎఫ్‌ఐడీ విధానం అమలు చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు జరగాలని ఆదేశించారు. సింగపూర్, మలేషియా, జపాన్, తదితర దేశాలలో ఆర్‌ఎఫ్‌ఐడీ విధానం అమలులో ఉంది. బోర్డులో ఒక చిప్ అనుసంధానంతో వాహన వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కడి నుంచి ఎటువైపు ప్రయాణిస్తుందో పసిగట్టడటం ఆర్‌ఎఫ్‌ఐడీ ప్రత్యేకత. కానీ సీఎం ప్రకటన అటకెక్కింది. దాని గురించి మళ్లీ ఆలోచన కూడా చేయలేదు.

 
నిబంధనలు బేఖాతర్

నాణ్యత గల లోహంతో బోర్డుల తయారీ జరగాలి. ప్రభుత్వ చిహ్నంతో హాలోగ్రామ్ ఉండాలి. యూనిక్ కోడ్‌తో దూరంలో గల వాహనాలను పసిగట్టే లేజర్ చిప్ అమర్చాలి. అయితే పరిశీలనలో తక్కువ నాణ్యత గల లోహపు రేకుతో బోర్డు తయారవుతోంది. జీపీఎస్‌కు అనుసంధానంగా లేజర్ చిప్ బోర్డులో అమర్చడం లేదు. ఆ ప్రస్తావన సంస్థ తీసుకురావడం లేదు. రాబోయే రోజుల్లో బోర్డులకు చిప్ అమర్చినా ఇప్పటి వరకూ మంజూరు కాబడ్డ బోర్డుల పరిస్థితి ఏమిటీ! అనేది ప్రశ్నార్థకం. ఇతర రాష్ట్రాలలో బోర్డుకు ఐదేళ్ల వారంటీ సంస్థలు ప్రకటిస్తుండగా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

 

రాష్ట్రంలో హై సెక్యూరిటీ నంబర్ బోర్డుల ప్రక్రియ నిలిపివేయనున్నట్టు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బోర్డుల తయారీలో నాణ్యత ప్రమాణాలు లోపించడం, వాహనదారులు ఆసక్తి చూపకపోవడంతో సేవలు నిలిపివేతకు సిద్ధపడింది. ప్రభుత్వం నుంచి అధికారకంగా ఉత్తర్వులు వెల్లడికాకపోవడంతో బోర్డుల ప్రక్రియ యథావిధిగా జరుగుతోంది. ఇక నుంచి అన్ని తరహా పాత వాహనాలకు కూడా ‘హై సెక్యూరిటీ’ బోర్డులు తప్పక కలిగి ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వాహనదారులలో గందరగోళం నెలకొంది.

 

 

మరిన్ని వార్తలు