ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ | Sakshi
Sakshi News home page

ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

Published Mon, Jun 20 2016 8:41 AM

ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ - Sakshi

  •  తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఘటన
  •  మృతుల్లో మావోయిస్టు కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్.. మరో ఇద్దరు మంగీ దళ సభ్యులు దినేశ్, ముఖేశ్
  •  తప్పించుకున్న మరో 15 మంది!
  •  ముమ్మరంగా పోలీసుల కూంబింగ్
  •  

     కాళేశ్వరం/మంచిర్యాల: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా వెంకటాపూర్ అటవీప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు కమిటీ సభ్యుడు, యాక్షన్ టీం నాయకుడు ఆత్రం శోభన్(30) అలియాస్ చార్లెస్ ఉన్నాడు. మరో ఇద్దరినీ మహారాష్ట్రకు మంగీ దళానికి చెందిన దినేశ్(27), ముఖేశ్(28)గా గుర్తించారు. శోభన్‌పై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి గ్రేహౌండ్స్ పోలీసు దళం, మహారాష్ట్రకు చెందిన సీ60, క్యూఆర్‌టీ పోలీసు బలగాలు గత రెండ్రోజులుగా సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు వెంకటాపూర్, లంకచేను పరిధిలో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలిసింది. రెండువైపుల నుంచి ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎదురుకాల్పుల్లో మరో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వారిలో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి  మైలారపు ఆడేల్లి భార్య కంది లింగవ్వ సోదరుడు కంది రవి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

     పోలీసులు అప్రమత్తం
     ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం బెజ్జూర్ మండల కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్లు, ప్రాణహిత ఒడ్డుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. శోభన్‌పై ఆదిలాబాద్ జిల్లాలో 20 కేసులు ఉండగా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయన జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. శోభన్ మృతి జిల్లాలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

     

     చర్లలో ముమ్మరంగా పోలీసు తనిఖీలు

     చర్ల: ఖమ్మం జిల్లా చర్లలో జరిగిన వారపు సంతలో పోలీసులు ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. వారి మాటున మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు, మిలిటెంట్లు రావచ్చునన్న అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయిరమణ ఆదేశాల మేరకు ఎస్సై రవీందర్  ఈ తనిఖీలు నిర్వహించారు.  సంతకు వచ్చిపోయే ఆదివాసీలను నిలిపివేసి వారి లగేజీని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ తనిఖీలలో సివిల్, స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement