ఆడపిల్ల పుట్టిందని..

3 Jun, 2016 03:21 IST|Sakshi
ఆడపిల్ల పుట్టిందని..

భార్యకు నిప్పంటించాడు..  
 
వారిది ప్రేమవివాహం. అమ్మాయి తరఫు వారు పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే అతడే కావాలనుకుంది ఆ యువతి. ఆ యువకుడ్నే పెళ్లి చేసుకుని తన ప్రేమను బతికించుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే మూడో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనివ్వడంతో ఆ మృగాడు.. ఆమెను అంత మొందించాలనుకున్నాడు.  గురువారం మద్యం తాగి ఇంటికొచ్చి.. తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ మహిళ కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
 

 
గోరంట్ల/ హిందూపురం అర్బన్ : మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న అక్కసుతో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగలబెట్టాడో ప్రబుద్ధుడు. గోరంట్ల మండలం కళ్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలిలా ఉన్నాయి.  పాలసముద్రం పంచాయతీ పుత్తూరు తండాకు చెందిన సుస్మితాబాయి కళ్లితండాకు చెందిన తిరుపాల్‌నాయక్ ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు. ఈ క్రమంలో వీరికి ఇద్దరు కుమార్తెలు త్రివేణిబాయి(5), కల్పనాబాయి(3) పుట్టారు.

అయితే ఆడపిల్లలంటేనే గిట్టని తిరుపాల్‌నాయక్ ఆమెతో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం సుస్మితాబాయి మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది.  నాటి నుంచి ఆ పసికందును చంపేయాలని తిరుపాల్‌నాయక్ నిత్యం పోరుపెట్టేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యను చంపాలని పథకం రూపొందించుకున్నాడు. గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చిన తిరుపాల్‌నాయక్ తన భార్యతో ఇదే విషయమై మళ్లీ గొడవపడ్డాడు. చివరికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు మంటలు ఆర్పివేసి సుస్మితాబాయిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆమె శరీరం 70 శాతం కాలిపోవడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి 108లో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మెజిస్ట్రేట్ ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితురాలి వివరాల మేరకు గోరంట్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు