రోడ్డెక్కిన జీసీసీ ఎమ్‌డీ కుటుంబ వ్యవహారం

20 Sep, 2013 02:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: జీసీసీ ఎమ్‌డీ రమేష్‌కుమార్ కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో భార్యకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ అత్తింటి వారు, పలు మహిళా సంఘాలు గురువారం ఎంవీపీ కాలనీలోని సెక్టార్-3లో ఉన్న ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. వివరాలిలావున్నాయి. విశాఖ నగరానికి చెందిన జీసీసీ ఎమ్‌డీ ఈతకోట రమేష్‌కుమార్‌కి వరంగల్ జిల్లాకు చెందిన కూరగంటి స్వప్నతో 2001లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

విభేదాలు తలెత్తడంతో భార్య నుంచి విడాకులు కావాలంటూ రమేష్ కుమార్ 2013 మార్చి 12వ తేదీన విశాఖ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ స్వప్న వరంగల్ పోలీసులను ఆశ్రయించారు.  భర్త తనను, పిల్లల్ని హింసిస్తున్నారంటూ గృహహింస చట్టం కింద మేలో ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అదే నెల 13వ తేదీన వరంగల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రెండు కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో రమేష్‌కుమార్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వప్న ఖమ్మం నుంచి తన బంధువులు, సన్నిహితులతో గురువారం విశాఖ చేరుకుని రమేష్‌కుమార్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బంధువులంతా బయట ఆందోళన చేస్తుంటే ఆమె నేరుగా రమేష్‌కుమార్ ఇంట్లోకి వెళ్లిపోయారు. ‘నేను నా భర్త ఇంట్లోనే ఉంటాను. అతను నన్ను, నా పిల్లలను సంరక్షించాల్సిందే’ అంటూ స్పష్టం చేశారు.
 
 పోలీసులకు ఫిర్యాదు : విషయం తెలుసుకున్న రమేష్‌కుమార్ ఎంవీపీ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవహారం కోర్టులో ఉందని, ఈ పరిస్థితుల్లో రచ్చచెయ్యడం భావ్యం కాదని, స్వప్నను, ఆమె బంధువులను అక్కడి నుంచి పంపాల్సిందిగా కోరారు. వృద్ధులైన తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నందున ఈ వివాదం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని పోలీసులను కోరడంతో ఈస్ట్ ఏసీపీ డి.ఎన్.మహేష్, సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. అయితే అటు రమేష్‌కుమార్‌గాని, ఇటు స్వప్న బంధువులుగాని దిగిరాక పోవడంతో సయోధ్య కుదర్చడం సాధ్యం కాలేదు. స్వప్న రమేష్‌కుమార్ ఇంట్లోకి వెళ్లిపోయి తాను బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో బంధువులు బయటే కాపలాగా ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుం దో అన్న ఆందోళనతో పోలీసులు ఇంటి ముందు  పికెట్ ఏర్పాటు చేశారు.

 ఆడపిల్లలు పుట్టారనే...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే స్వప్నను వదిలించుకునేందుకు, మరో పెళ్లి చేసుకునేందుకు రమేష్‌కుమార్ చూస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఖమ్మం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్రోజ్ సమీనా, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గపేట సరళ, విశాఖ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సుజాత తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఒక ఉన్నతాధికారి అయ్యుండి భర్త తనను, పిల్లల్ని కొట్టేవారని, దీంతో ఢిల్లీలోని ఐఏఎస్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేసినట్లు స్వప్న తెలిపారు. తమది పూర్తిగా కుటుంబ వ్యవహారమని, ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నందున స్వప్న కొంతమందితో కలిసి ఇంట్లోకి చొరబడడం అన్యాయమని జీసీసీ ఎమ్‌డీ ఇ.రమేష్‌కుమార్ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు