జగన్‌పై చంద్రబాబు చీకటి కుట్రలు: వాసిరెడ్డి పద్మ | Sakshi
Sakshi News home page

జగన్‌పై చంద్రబాబు చీకటి కుట్రలు: వాసిరెడ్డి పద్మ

Published Fri, Sep 20 2013 2:39 AM

జగన్‌పై చంద్రబాబు చీకటి కుట్రలు: వాసిరెడ్డి పద్మ - Sakshi

టీడీపీ అధినేతపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
జగన్ బెయిల్ పిటిషన్‌పై బాబు తీరును సమాజం అసహ్యించుకుంటోంది
జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమైపోయింది
కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై టీడీపీనే భూస్థాపితం చేశారు
బాబు నాలుగేళ్లలో 40 సార్లు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జనంతో ఆడుకున్నారు
రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చింది మీరు కాదా చంద్రబాబూ?
దర్యాప్తు సంస్థలను, కోర్టులనూ ప్రభావితం చేస్తున్నది ఎవరు బాబూ?
టీడీపీ ఎంపీలను బాహాటంగానే సీవీసీ, సీబీఐ, ఈడీల వద్దకు పంపారు
జగన్‌పై దర్యాప్తులో ఏ ఒక్క ఆధారమూ దొరకలేదనా ఇంత ఆత్రుత?
లోకేష్‌ను నాలుగేళ్లు జైల్లో పెడితే ఎలా ఉంటుంది?
బాబుపై విజయమ్మ చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేస్తారా?
చార్జిషీట్లు అంటే ఆరోపణలే... ఆరోపణల్లో నిజం తేల్చాల్సింది కోర్టులే
ఆర్థిక నేరగాడైన రామోజీరావు తన పత్రికలో తీర్పులు రాస్తారా?

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో ప్రజల్లో, ఎన్నికల్లో పోటీపడే ధైర్యం లేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనకు తెలిసిన చీకటి రాజకీయాలను ప్రయోగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోందని ఆమె దుయ్యబట్టారు. వాసిరెడ్డి పద్మ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశ ంలో మాట్లాడారు. ‘‘ఈ రాష్ట్రంలో ఎన్.టి.రామారావు కూడా చేయలేని పనిని జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపారు. జగన్ వల్లే ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో కుమ్మక్కు, చీకటి ఒప్పందంతో టీడీపీనే భూస్థాపితం చేశారు. అసలు కాంగ్రెస్‌తో జగన్ ఎందుకు కుమ్మక్కు అవుతారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. కుమ్మక్కు కాదలచుకుంటే కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వస్తారని, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ 16 నెలలుగా జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తోందని అడిగారు.  
 
 ప్రతి అంశంలోనూ కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు...
 చంద్రబాబు నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీతో 40 అంశాల్లో కుమ్మక్కయి జనంతో ఆడుకున్నారని మండిపడ్డారు. ‘‘ఇప్పుడు కూడా తెలంగాణ ఇచ్చేయండి అంటూ బ్లాంక్ చెక్‌లా లేఖలు ఇచ్చింది, రాష్ట్ర విభజనకు కారణమైంది మీరే కదా? ఇప్పటికైనా మించిపోయిందేమిలేదు.. ఆ లేఖను వెనక్కి తీసుకోండి అంటే లేఖను వెనక్కు తీసుకోరు’’ అంటూ చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. జనంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించలేం అన్న భయంతో చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ, ఫోన్లలో కాంగ్రెస్ నాయకులందరితో సంప్రదింపులు జరుపుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వరకూ ప్రతీ అంశంలోనూ కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా ‘ఇంతకూ అధికార పార్టీ మీద అవిశ్వాసం పెడితే మీరు ఓటింగ్‌లో పాల్గొనకుండా విప్ ఎందుకు ఇచ్చారు?’ అని చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమిలారని పద్మ ఎద్దేవా చేశారు.
 
 బహిరంగంగానే ఇంతకు తెగించారు...
 ‘‘కాంగ్రెస్ నేత శంకర్రావుతో కలిసి 2010లో మీరు కేసు వేసినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. కాదని అదొక రాజకీయ ప్రేరేపితమైందంటూ మేం ఆ రోజే వాదిం చాం. అయినా ఆ రోజున మా మాటలు వినలేదు. అది ఇప్పుడిప్పుడే నిరూపితమవుతోంది’’ అని పద్మ పేర్కొన్నారు. ‘‘ఈ రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందీ తెలిసి కూడా ఇక అన్యాయంగా జగన్‌ను ఒక్క నిమిషం కూడా జైల్లో ఉంచటానికి వీల్లేదన్నది అర్థమై చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారు. టీడీపీ ఎంపీలను సీవీసీ, సీబీఐ, ఈడీల దగ్గరకు పంపించారు. టీడీపీకి చెందిన 11 మంది ఎంపీలు నేరుగా సీబీఐని, ఈడీలను కలుస్తున్నారు. ఈ కేసును ప్రభావితం చేస్తున్నందుకు ఈ దేశంలోని చట్టం న్యాయం అందరికీ ఒకేలా వర్తించేటట్టు అయితే మిమ్మల్ని, మీ ఎంపీలను కూడా జైల్లో పెట్టాలి. ఒక నాయకుడిని జైల్లో పెడితే తప్ప అతనితో ఎన్నికల్లో పోరాడలేనని చేతులు ఎత్తేసిన మీరు ఒక నాయకుడేనా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
 
 లోకేష్‌ను నాలుగేళ్లు జైల్లో పెడితే ఎలా ఉంటుంది?
 ‘‘చంద్రబాబు.. గుర్తుంచుకో! మనిషి అంటేనే పుట్టుకే కాకుండా చావు కూడా ఉంటుంది. రాజశేఖరరెడ్డి ఒక్కరే కాదు అందరూ మరణించే వాళ్లమే. ఎవరు ముందు ఎవరు వెనక అన్నదే ప్రశ్న. మీరు 65 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఏదో ఒక రోజున మీ తర్వాత మీ కుమారుడు అక్రమ ఆస్తులు సంపాదించారని, మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వెనకేసుకున్నాడని కేసు వేస్తే.. ఆ రోజున మీ కొడుకును కూడా ఇలాగే ఒక నాలుగేళ్లు ఎలాంటి విచారణ ప్రారంభం కాకమునుపే జైల్లో వేయవచ్చా? రానున్న ప్రభుత్వంలో చంద్రబాబు అవకతవలన్నింటిపైనా తప్పకుండా విచారణ జరిగితీరుతుందన్నారు. అప్పుడు చంద్రబాబు, తన కుమారుడు దేశాలు పట్టుకొని పారిపోవాల్సి ఉంటుందన్నారు.
 
 శ్వేతపత్రం విడుదల చేయటానికి మీరెవరు?
 రోజుకో శ్వేతపత్రం అంటున్న చంద్రబాబు.. సీబీఐ మూడేళ్లుగా 20 టీంలతో దాడులు చేస్తూ, ఫోన్లు ట్యాప్ చేస్తూ, పెట్టెల కొద్దీ పత్రాలు స్వాధీనం చేసుకొని, 12 చార్జిషీట్లు వేసినా జగన్ శిక్షపడే ఆధారాలు ఏ ఒక్కటి దొరకలేదనేనా ఆయన ఆత్రుత? ఇంతకీ జగన్‌పై శ్వేతపత్రం విడుదల చేయటానికి మీరెవరంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయనపై వందల కొద్దీ ఆరోపణలు ఉన్నప్పటికీ, విజయమ్మ వేసిన పిటిషన్‌లో ఉన్న 18 అంశాలకు సంబంధించి వచ్చే 18 రోజుల్లో ఒక అఫిడవిట్ రూపంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తారా?’’ అని బాబును సూటిగా ప్రశ్నించారు.
 
 రామోజీ ఒక ఆర్థికనేరగాడు.. జడ్జీ కాదు
 ‘‘భారతి సిమెంట్స్ విషయంలో సీబీఐ వేసిన అభియోగపత్రాలు కనీసం భారతి సిమెంట్‌కు కూడా ఇవ్వలేదు. మరి ఆ చార్జిషీట్లు నేరుగా ‘ఈనాడు’ పత్రికకు ఎలా వచ్చాయి? చార్జిషీట్ అంటే అర్థం ఆరోపణ అని మాత్రమే. ఆరోపణలన్నీ నిజం కావు. ఆరోపణల్లో ఏ ఒక్కటీ కూడా నిజం కాకపోవచ్చు. ఆరోపణల్లో నిజం ఉందో లేదో తేల్చాల్సింది న్యాయస్థానాలే తప్ప రామోజీరావు కాదు. రామోజీనే ఓ పెద్ద ఆర్థిక నేరస్తుడు. ఆయన మీద మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి దాదాపు రూ. మూడు వేల కోట్లు అక్రమంగా ప్రజల సొమ్ము కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. పత్రిక ఉంది కదా అని ప్రత్యర్థికి సంబంధించి ఇలా జడ్జిమెంట్లు రాయటాన్ని జర్నలిజం అంటారా?’’ అని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement