కాటన్..టెన్షన్..!

27 Apr, 2015 02:16 IST|Sakshi

- పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన
- రికార్డులు తారుమారు చేసే పనిలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు
- మంత్రి ప్రత్తిపాటిని కలసిన దళారులు, పారిశ్రామికవేత్తలు
- నామామాత్ర విచారణ జరిగేలా చూడాలని వేడుకోలు
- మరో వైపు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరిన విజిలెన్స్ ఎస్పీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు :
పత్తి కొనుగోలులోని అవినీతి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని వివిధ శాఖల అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ అక్రమంలో ముఖ్య భూమిక వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు పాత రికార్డులను సరిచేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో తెరవెనుక ఉండి వ్యవహారం నడిపిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సేఫ్ జోన్‌లోనే ఉంటారని, తమపైనే వేటు పడుతుందనే ఆందోళనలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు.

ఈ గండం నుంచి తమను గట్టెక్కించకపోతే విచారణలో అసలు బండారం బయట పెడతామని కొందరు హెచ్చరించడంతో ఈ వ్యవహారం ముదురు పాకాన పడింది. దీంతో కొంతమంది దళారీలు, పత్తి ఆధారిత పారిశ్రామికవేత్తలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలసి విచారణ నామమాత్రంగా జరిగే విధంగా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశాలు ఇస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తమతోపాటు అనేక మంది నేరస్తులుగా మిగిలిపోతారని చెప్పినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే పత్తి కొనుగోలులోని అక్రమాలపై వివిధ దినపత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురి ంచడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్.పి. కేవీ మోహన్‌రావు వాటి వివరాలను ప్రభుత్వానికి వివరించారు. విచారణకు అనుమతి కోరారు. అయితే సీబీఐతోనే విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద పత్తి కొనుగోలుకు సంబంధించిన వివరాలను అందించాలని సీసీఐ అధికారులను విపక్షాల ప్రతినిధులు కోరారు.

రికార్డుల తారుమారు ...
జిల్లాలోని 11 కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆ కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో 2.19 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

వాస్తవంగా మిగిలిన కొనుగోలు కేంద్రాల్లో సెప్టెంబరులో కొనుగోళ్లు ప్రారంభమైతే చిలకలూరిపేటలో మంత్రి కుమార్తె వివాహ వేదిక మార్కెట్‌యార్డు కావడంతో నవంబరులో ప్రారంభించారు. అప్పటికే రైతులు ప్రైవేట్ వ్యాపారుల పేరుతో చెలామణి అయిన మంత్రి అనుచరులకు క్వింటాలు రూ.3500లోపే అమ్ముకున్నారు. ఏప్రిల్ 15తో కొనుగోళ్లు నిలిపివేశామని సీసీఐ అధికారులు ప్రకటించినా, మార్చినెలాఖరునాటికి కొను గోళ్లు నిలిచిపోయాయి.

ఈ కేంద్రంలో లక్ష క్వింటాళ్ల లోపే కొనుగోళ్లు జరిగినట్టు అక్కడి సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. రికార్డుల్లోని మిగిలిన తేడాను సరిచేసేందుకు మిగిలిన ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చినట్టుగా రికార్డులు తారుమారు చేస్తున్నారని, గుంటూరు మార్కెట్ యార్డులోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

ఇంకా పూర్తికాని విచారణ .....
ఇదిలాఉండగా, 2004లో కూడా పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో దీనిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అనేక మంది ఉద్యోగులు, అధికారులు విచారణకు హాజరవుతూనే ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు