చినుకు చక్కగా..

1 Oct, 2019 04:22 IST|Sakshi

నైరుతి.. సంతృప్తి

ముగిసిన ఖరీఫ్‌ పంటల సాగు సీజన్‌

రెండు జిల్లాల్లో అధిక వర్షపాతం

11 జిల్లాల్లో సాధారణం

రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 10% అధిక వర్షపాతం నమోదు

సాక్షి, అమరావతి: జూన్‌ 1న మొదలైన ఖరీఫ్‌ (సార్వా) సీజన్‌ సెప్టెంబర్‌ 30తో ముగిసింది. నైరుతి రుతు పవనాలు కూడా సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగిసినట్లే లెక్క. సాంకేతికంగా చూస్తే.. రుతు పవనాలు దాటిపోవడానికి వారం అటూ ఇటూ పట్టవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆరంభంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ చివరకు వచ్చేసరికి సంతృప్తి మిగిల్చాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం.. మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఈ సీజన్‌లో 565.2 మిల్లీమీటర్ల వర్షపాతం (10 శాతం అధికం) నమోదైంది.

వాతావరణ శాఖ  50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తుంది. దీనికంటే 19 శాతం ఎక్కువ కురిసినా, తక్కువ కురిసినా సాధారణ వర్షపాతంగానే పేర్కొంటుంది. సాధారణం కంటే 20 శాతం తక్కువైతే లోటు వర్షపాతంగా, ఎక్కువైతే అధిక వర్షపాతంగా గుర్తిస్తుంది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే 12 శాతం, కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో 9 శాతం అధిక వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో 556.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 676.4 మిల్లీమీటర్లు (22 శాతం అధికం) వర్షపాతం రికార్డయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 728.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 874 మిల్లీమీటర్లు (20 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.

రిజర్వాయర్లలో జలకళ
ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో అనుకున్న వర్షపాతం నమోదు కావడంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా శ్రీశైలం,  ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగుకు, భూగర్భ జలమట్టం పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతోంది. ఈ వర్షాలు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు కూడా బాగా ఉపకరిస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

సాగు.. బాగు
సెప్టెంబర్‌ 30తో ముగిసిన  ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలన్నది లక్ష్యం. ఈ లెక్కన జూన్‌ 1నుంచి సెప్టెంబర్‌ 25 నాటికి 38.30 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 35.26 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్‌ మొత్తమ్మీద చూస్తే.. సెప్టెంబరు 25వ తేదీ వరకూ గణిస్తే 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఈ సీజన్‌లో సాగు సంతృప్తికరంగా ఉన్నట్లే. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌ ఆరంభం నుంచి రెండు నెలలు సరైన వర్షం కురవకపోవడం వల్ల నిర్ణయించిన సాగు లక్ష్యంలో 93 శాతం విజయవంతమైంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు