సాగు పరిశోధనల్లో 'ఏఐ' | Sakshi
Sakshi News home page

సాగు పరిశోధనల్లో 'ఏఐ'

Published Sun, Oct 29 2023 4:35 AM

Artificial intelligence in cultivation research - Sakshi

సాక్షి, అమరావతి: పంటల సాగులో కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యాన  పరిశోధక విద్యార్థులు (రీసెర్చ్‌ స్కా­లర్లు) బాటలు వేస్తున్నారు. పరిశోధనా స్థానా­ల్లో శాస్త్రవేత్తల కృషికి ఊతమిచ్చేలా సాగు­తున్న వీరి పరిశోధనలు సత్ఫలితాలిస్తు­న్నాయి. చీడపీడల నివారణ, వంగడాల అభివృద్ధితో పాటు కృత్రిమ మేథస్సు (ఏఐ) ద్వారా పంట కీటకాల వర్గీకరణ, గుర్తింపు, నానో జీవ రసాయనాల ద్వారా కీటకాల నియంత్రణా చర్యలు, మార్కర్‌ టెక్నాలజీ ద్వారా పరమాణు స్థాయిలో అంచనా వేయడం వంటి నూతన ఆవిష్కరణలు, పలు రకాల సాగు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను వారు చూపిస్తున్నారు.

సంప్రదాయ పంటలతో పాటు సంప్రదాయేతర పంటలైన అవకాడో, స్ట్రాబెర్రీ, గోల్డెన్‌ బెర్రీ, చియా, లిసియాంతస్, ట్యూలిప్స్‌ వంటి పంటలను మన వాతావరణానికి అనుకూలంగా లాభసాటి సాగుకు ఉన్న అవకాశాలను విశ్లేషిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు, రసాయన విశ్లేషణ సాధనాలతో పాటు క్రోమోటోగ్రఫీ, ఫోటోమెట్రీ డీఎన్‌ఏ యాంప్లిఫికేషన్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. సీసీఆర్‌ (నాగ్‌పూర్‌), ఐఐహెచ్‌ఆర్‌ (బెంగళూరు), ఎన్‌ఆర్‌సీ (త్రిచీ), ఐఐవీఆర్‌ (వారణాశి), డీఎఫ్‌ఆర్‌ (పూణే), ఐఐఓపీఆర్‌ (ఆయిల్‌ పామ్‌) వారి సహకారంతో వీరు సాగిస్తున్న పరిశోధనలు రైతు క్షేత్రాల్లో విజయవంతమవుతున్నాయి. 

అడవిజాతి వంగతో సంకరం.. 
గోదావరి జిల్లాల్లో వంకాయలో ప్యూసెరియం విల్ట్‌ వ్యాధి, కాయతొలిచే పురుగు అధికంగా ఉంటుంది. రైతులకు తీవ్ర నష్టానికి గురిచేస్తున్న ఈ సమస్య పరిష్కారానికి స్థానిక వంకాయ (సోలనం మెలోంగెనా)తో అడవి వంకాయ జాతులను అంటుకట్టుటపై పరిశోధన చేశా. సోలనమ్‌ తోర్వుం అనే అడవి జాతి రకం వంకాయలో రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉంది. ఇలా చేయడంవల్ల వంకాయలో వచ్చే ప్యూసెరియం విల్ట్‌ వ్యాధిని, కాండం తొలిచే పురుగును పూర్తిగా అరికట్టవచ్చు. 
– ఎం. జస్మిత, పీహెచ్‌డీ విద్యార్థి 

టిష్యూ కల్చర్‌ ద్వారా పూలసాగు 
ప్రజ్వల రకానికి చెందిన లిల్లీ పువ్వులపై పరిశోధనలు చేశా. పువ్వుల భాగాల నుంచి టిష్యూ కల్చర్‌ (కణాజాల ప్రవర్థనం) ద్వారా మొక్కలు ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నా. అలాగే, నాణ్యమైన నాటు దుంపల సాగులో దిగుబడి నష్టాలకు గురిచేస్తున్న నెమటోడ్ల సమస్యకు పరిమిత జన్యు వైవిధ్యం కారణంగా గుర్తించాం. కణజాల ప్రవర్థనం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని నిరూపించా. 
– పీ.ప్రణతి, పీహెచ్‌డీ విద్యార్థి 

వైరస్‌ నిరోధక టమాటా, బెండ రకాల అభివృద్ధి 
‘లీఫ్‌ కర్ల్‌’ వైరస్‌ నిరోధక హైబ్రీడ్‌ రకం టమాటాతో పాటు వైరస్‌ తెగులు (వైవీఎంవీ)ను తట్టుకునే కొత్త రకం హైబ్రీడ్‌ను అభివృద్ధి చేశా. పర్యావరణంలో అసాధారణ మార్పులను తట్టుకుంటూ నాణ్యమైన దిగుబడినిచ్చేలా వీటిని తీర్చిదిద్దాం. 
– టి. నవీన్‌కుమార్, పీహెచ్‌డీ విద్యార్థి 

రైతులకు మేలు చేకూర్చే పరిశోధనలు 
స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పరిశోధనల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వంగడాల అభివృద్ధి, నూతన పంటల అనూకూలత, కృత్రిమ మేథస్సు ద్వారా తక్కువ సమయంలో కీటకాలను గుర్తించి వర్గీకరించడం, నానో టెక్నాలజీ, డ్రోన్స్‌ ద్వారా పురుగు మందుల దు్రష్పభావాలను తగ్గించే దిశగా చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇవి రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేలా ఉన్నాయి. 
– డాక్టర్‌ టి. జానకీరామ్, వీసీ, వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం 
 
ఏఐ ద్వారా కీటకాల గుర్తింపు
ఏఐ ద్వారా కన్వల్యూషనల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ల (సీఎన్‌ఎన్‌) ఆధారంగా ఉద్యాన పంటల కీటకాల గుర్తింపు, వ­రీ­్గ­క­­రించేందుకు కొత్త పద్ధతిని కను­గొ­న్నారు. ఉద్యాన పంటల కీటకాలను ముందస్తుగా గుర్తించడంవల్ల వాటిని నియంత్రించడమే కాదు.. వాటి ద్వారా వచ్చే తెగుళ్ల అణిచివేతకు కూడా సత్వర నివారణా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో గుర్తించా. 
– సాయికుమార్, పీహెచ్‌డీ విద్యార్థి  

Advertisement
Advertisement