క్లినికల్‌ ట్రయల్స్‌పై నూతన విధానం 

1 Oct, 2019 04:22 IST|Sakshi

నిలోఫర్‌ సంఘటన నేపథ్యంలో సర్కార్‌ కసరత్తు

‘నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌’పై కమిటీ సుదీర్ఘ విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ఔషధ ప్రయోగాలపై నూతన విధానాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఈ ఏడాది తీసుకొచ్చిన క్లినికల్‌ ట్రయల్స్‌–2019 మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత పకడ్బందీగా రాష్ట్రంలోనూ తీసుకురావాలని భావిస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయమూర్తి నేతృత్వంలో క్లినికల్‌ ట్రయల్స్‌పై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఆ నివేదికను బయటకు తీసి కేంద్ర నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని తీసుకురావాలనేది సర్కారు ఆలోచన అని వైద్య విద్యా వర్గాలు తెలిపాయి. నిలోఫర్‌ ఆసుపత్రిలో పసిపిల్లలపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వివాదాస్పదం కావడంతో సర్కారు నూతన విధానంపై దృష్టిసారించింది. ఇక నిలోఫర్‌ సంఘటనపై సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఉల్లంఘన జరిగితే ఉపేక్షించొద్దని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం.  

విచారణ షురూ: నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారాన్ని తేల్చేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం సుదీర్ఘ విచారణ జరిపింది. ప్రొఫెసర్‌ రాజారావు, ప్రొఫెసర్‌ విమలాథామస్, ప్రొఫెసర్‌ లక్ష్మీ కామేశ్వరి నేతృత్వంలోని కమిటీ 5 గంటల పాటు నిలోఫర్‌లో విచారించింది. సుమారు 260 మందిపై 5 రకాల ట్రయల్స్‌ నిర్వహించినట్టు కమిటీ తేల్చినట్లు సమాచారం. వీళ్లలో ర్యాండమ్‌ గా కొందరితో కమిటీ సభ్యులు ఫోన్‌లో మాట్లాడి ట్రయల్స్‌ జరిగినట్టు తెలుసా లేదా అని ప్రశ్నించి సమాధానాలు రికార్డు చేశారు.  సాయం త్రం వైద్య విద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డికి కమిటీ ప్రాథమిక నివేదిక ఇచి్చనట్లు సమాచారం.  

నిబంధనలకు విరుద్ధంగానే..! 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎథిక్స్‌ కమిటీ అనుమతులున్నా ట్రయల్స్‌ మాత్రం నిబంధనల ప్రకారం జరగలేదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. అధికారులపై కొన్ని ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్‌ వివరాలను అందజేయాలని రమేశ్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఎథికల్‌ కమిటీలను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా