కిడ్నీ ఫెయిల్

20 Jun, 2016 02:05 IST|Sakshi

అర్జునగిరిని వణికిస్తున్న మూత్రపిండాల వ్యాధి
పది నెలల వ్యవధిలో నలుగురు మృతి
కేజీహెచ్‌లో మృత్యువుతో పోరాడుతున్న మరో రైతు
ఖరీదైన వైద్యంతో అప్పుల ఊబిలో కుటుంబాలు
వైద్య బృందం వచ్చి సమస్య గుర్తించాలని గ్రామస్తుల వేడుకోలు

 

చీడికాడ మండలం అర్జునగిరి వాసులను ఇప్పుడు మూత్రపిండాల వ్యాధి భయపెడుతోంది. కిడ్నీలు ఫెయిలై పది నెలల వ్యవధిలో నలుగురు మృతి చెందడమే ఇందుకు కారణం. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తోందో..? ఎందుకు ఆకస్మికంగా మృత్యువాత పడుతున్నారో.. అర్థంకాక గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి వైద్య బృందాన్ని పంపించి సమస్య గుర్తించాలని కోరుతున్నారు.

 

చీడికాడ:  కిడ్నీల వ్యాధి బారినపడి మండలంలోని అర్జునగిరిలో పదినెలల వ్యవధిలో  గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మృత్యువాత పడ్డారు. అగ్రపు భోగినాయుడు (55) అనే మరో  రైతు రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయస్థితిలో నెల రోజులుగా విశాఖ కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు.  బాధితులంతా నిరుపేద రైతులు కావడంతో  వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుచేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయినా ఫలితం దక్కక నిరాశలో మునిగిపోయారు. నిత్యం వ్యవసాయ పనుల్లో మునిగితేలే రైతు బిడ్డలకు ఈ వ్యాధి సోకడానికి వారి జీవనశైలి కారణమా.. లేక తాగునీరా.. మరేదైనా సమస్యా అనేది ప్రశ్నగా మిగిలింది. సాధారణంగా ఒక కిడ్నీ దెబ్బతింటే మరో  కిడ్నీతో  కాలం వెళ్లదీస్తారని, కాని తమ గ్రామంలో ఇప్పటివరకు బాధితులంతా  ఒకే సారి రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామానికి వైద్య బృం దాన్ని పంపి ఈ వ్యాధికి కారణాలను అన్వేషించాలని కోరుతున్నారు. చనిపోయిన వారంతా ఆసరాగా ఉన్నవారే కావడంతో కుటుంబాలు  రోడ్డునపడ్డాయి. ఎక్కువ రోజులు ఖరీదైన వైద్యం చేయించలేక కళ్ల ముందే తమ వారు తనువు చాలిస్తుంటే నిసహాయస్థితిలో చూస్తు ఉండిపోయిన కుటుంబాలే అన్నీ..

 

శక్తికి మించి అప్పులు చేసినా..
నిత్యం పొలం పనులతో కష్టపడే పాడి రైతు బుసాల మహలక్ష్మినాయుడు (65) ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు.   విశాఖ డెయిరీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా  రెండు కిడ్నీలు చెడిపోయాయని తేలింది. విశాఖ నగరంలోని  ప్రైవేట్ ఆస్పత్రుల్లో కుటుంబ సభ్యులు కొద్ది రోజులు వైద్యం చేయించారు.   రెండున్నర లక్షల వరకు అప్పులు చేసి మూడు మాసాల పాటు డయాలసిస్ చేయించారు.  తరువాత ఖర్చులు భరించలేక  దాతల కోసం ఎదురుచూశారు.  ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గ్రామానికి తీసుకొచ్చిన 15  రోజుల తరువాత మృతి చెందాడని భార్య దేముడమ్మ చెప్పారు.   శక్తికి మించి అప్పులు చేసినా మనిషిని దక్కించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తంచేశారు.

 

కిడ్నీ మార్పిడికి సిద్ధపడినా..
తంగేటి దేముడుబాబు అనే వ్యక్తి గ్రామంలోని విశాఖ డెయిరీ పాల కేంద్రంలో కార్యదర్శిగా విధులు నిర్వహించేవాడు. ఆయనకు ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా  ఎనిమిది నెలల క్రితం ఆరోగ్యం దెబ్బతింది. వైద్య పరీక్షలు చేయించుకోగా రెండు కిడ్నీలు చె డిపోయాయని చెప్పడంతో పలు ఆసుపత్రుల్లో  కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు.  కిడ్నీ మార్పిడికి సిద్ధపడినపప్పటికీ ఆపరేషన్‌కు రూ. 10 లక్షల మేర ఖర్చవుతుందని, అయినా సక్సెస్ అవుతుందని హామీ ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు దేముడుబాబు అల్లుడు నాయుడుబాబు చెప్పారు.   ఆరు మాసాల పాటు రెండు వారాలకు ఒక మారు రూ. 6 వేలతో డయాలసిస్ చేయించామన్నారు. తరువాత కిడ్నీలు సహకరించక పోవడంతో రెండు నెలల క్రితం డాక్టర్ల సలహా మేరకు ఇంటికి తీసుకురాగా  15 రోజుల్లోనే మృతి చెందాడని తెలిపారు.

 

ఒకే సమస్యతో తల్లి, తండ్రి మృత్యువాత
ఇతని పేరు జాజిమొగ్గల చిన్నంనాయుడు. ఇతను సన్నకారు రైతు. ఎనిమిదేళ్ల క్రితం  అతని తండ్రి నర్సింహమూర్తి కిడ్నీ సమస్యతో మరణించగా తల్లి అమ్మాజీ (50) కూలి పనులు చేసి ముగ్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది. అమ్మాజీకి ఏడాది క్రితం నడుమునొప్పితో కూడిన జ్వరం రావడంతో ైవె ద్య పరీక్షలు చేయించగా   రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు.  రెండు వారాలకొకసారి డయాలసిస్ చేయించుకోకుంటే ప్రాణాప్రాయమని చెప్పడంతో ఉన్న రెండు పాడి పశువులను అమ్మి, భూమిని తనఖా పెట్టి సుమారు 4 నెలల పాటు తల్లికి వైద్యం చేయించాడు.  2 లక్షల వరకు ఖర్చుచేశాడు.  ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కిడ్నీ మార్పిడి అవకాశంపై ఆరా తీయగా రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని, అయినా గ్యారెంటీ ఇవ్వలేమని   వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చేశాడు.   15రోజుల తరువాత  ఆమె తనవు చాలించింది.


వైద్యం చేయించుకునే స్తోమత లేక..
పెంటకోట మల్లమ్మ(65)కు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె భర్త  మరణించాడు. ఉన్న కాస్త భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు వె ళుతూ పిల్లలను పెద్దచేసి పెళ్లిల్లు చేసింది. మూడు నెలల క్రితం ఆమెకు జ్వరం సోకడంతో వైద్య పరీక్షలు చేయించగా రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డుతో విశాఖ కేజీహెచ్‌లో వైద్యం అందించారు. తరువాత కార్డు పరిధి అయిపోయిందని చెప్పడంతో ప్రయివేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించే స్తోమత లేక ఇంటికి తీసుకువచ్చేశారు. దీంతో మల్లమ్మ గత నెల 6న ఇంటివద్ద మరణించినట్లు పెద్ద కుమార్తె జాజిమొగ్గల లక్ష్మి చెప్పారు. తల్లి మరణంతో తమకు పుట్టిల్లు లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమైంది.

 

>
మరిన్ని వార్తలు