-

‘కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌' అంటే? తలెత్తే సమస్యలు..

27 Nov, 2023 16:57 IST|Sakshi

కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్‌ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్‌ డిసీజ్, సిస్టమిక్‌ స్మ్లికరోసిస్, మిక్స్‌డ్‌ కనెక్టివ్‌ టిష్యూ డిసీజ్‌తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్‌ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 

కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌లో ప్రధానమైనది లూపస్‌ అని పిలిచే వ్యాధి. లూపస్‌ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్‌ అంటారు. అలాగే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

లక్షణాలు... 

  • లూపస్‌లో కనిపించే ఈ (మాలార్‌) ర్యాష్‌ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు.
  • కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్‌లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్‌ లూపస్‌ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్‌ రావచ్చు.
  • తరచూ జ్వరం వస్తుంటుంది.
    బరువు తగ్గుతుంది.
    కొందరిలో జుట్టు రాలిపోవచ్చు.
  • మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్‌) కూడా రావచ్చు. ఈ అల్సర్స్‌ వల్ల నొప్పి ఉండదు.
  • కొందరిలో డిప్రెషన్‌ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్‌ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్‌ఏ పరీక్ష  నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి.
  • కొందరిలో ఫిట్స్‌ రావచ్చు. ఇక రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో పాటు మిగతా వాస్క్యులార్‌ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి.
  • రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు.
  • అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్‌ఫ్లమేషన్‌ రావడం, కార్నియాకు ఇన్‌ఫ్లమేషన్‌ రావడం వంటి సమస్యలు రావచ్చు. 

పిల్లల్లోనూ...
కొలాజెస్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌లోని లూపస్‌ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్‌ సిస్టమిక్‌ లూపస్‌ అంటారు.

చికిత్స...
ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్‌ వంటి స్టెరాయిడ్స్‌ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. 

--డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి, సీనియర్‌ రుమటాలజిస్ట్‌  

(చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..)

మరిన్ని వార్తలు