ఆఖరి రోజూ అదే రద్దీ

26 Jul, 2015 01:33 IST|Sakshi
ఆఖరి రోజూ అదే రద్దీ

- బోగీ పట్టాలు తప్పడంతో రైళ్లు ఆలస్యం
- కిటకిటలాడిన రైల్వేస్టేషన్
- 100 ప్రత్యేక బస్సుల ఏర్పాటు
సాక్షి, విజయవాడ :
గోదావరి పుష్కరాల ఆఖరిరోజు శనివారం కూడా నగరం నుంచి వేలాది మంది పుష్కర స్నానాలకు వెళ్లారు. అయితే, గత శని, ఆదివారాలతో పోలిస్తే ఆఖరి రోజు పుష్కరాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉందని రైల్వే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకే పుష్కరాలు ముగుస్తాయని ప్రకటించడంతో ఉదయం పూటే ఎక్కువ మంది స్నానాలకు తరలివెళ్లారని అధికారులు తెలిపారు.
 
ఆలస్యంగా నడిచిన రైళ్లు
చేబ్రోలు- బాదంపూడి మధ్య రాయగడ పాసింజర్‌లోని ఒక బోగీ కొద్దిగా పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై దాన్ని సరిచేయించి పంపారు. ఒకవైపు పుష్కరాల రద్దీ, మరోవైపు బోగీ పట్టాలు తప్పడంతో రాజమండ్రి వైపు నుంచి వచ్చే రైళ్లు రెండు, మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. శనివారం ఉదయం 8 ప్రత్యేక రైళ్లు యధావిధిగా నడిచాయి. మూడేసి గంటలు ఆలస్యంగా వెళ్లాయి. పుష్కర స్నానానికి వెళ్లేవారు, యాత్రను ముగించి వచ్చేవారితో ఉదయం స్టేషన్ కిటకిటలాడినా.. మధ్యాహ్నం తరువాత కొంత ఖాళీగా కనిపించింది.
 
100 ప్రత్యేక బస్సులు
శుక్రవారం రాత్రి పుష్కరాల కోసం 150 బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ శనివారం మరో వంద నడిపింది. ఉదయం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో కేశినేని భవన్ నుంచి  50 బస్సులు నడిపారు.

మరిన్ని వార్తలు