నకిలీ నోట్ల కేసులో న్యాయవాది అరెస్ట్‌

28 Jan, 2018 12:21 IST|Sakshi

తిరుపతి క్రైం: తిరుపతి నగరంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఈస్టు సబ్‌ డివిజనల్‌ ఇన్‌చార్జి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ఈస్టు పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాయలచెరువు రోడ్డులోని పళణి థియేటర్‌ సమీపంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈస్టు సీఐ శివప్రసాద్, ఎస్‌ఐలు షేక్‌షావలి, ప్రవీణ్‌కుమార్‌ తమ సిబ్బందితో దాడి చేశారని పేర్కొన్నారు.

 ఇందులో దొంగనోట్లు చెలామణి చేస్తున్న వైఎస్సార్‌ జిల్లాకు చెందిన న్యాయవాది రామచంద్రరావును అరెస్టు చేశామన్నారు. అతను తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటూ స్థానిక కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడని తెలిపారు. స్నేహితుడి సాయంతో దొంగనోట్లను చెలామణి చేస్తున్నట్టు వివరించారు. అతని వద్ద ఉన్న దొంగనోట్లు రూ.17,500తోపాటు చెన్నారెడ్డికాలనీలో ఉన్న ఇంట్లో ఉంచిన రూ.4.80 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అవి వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందిన నాగాహరిప్రసాద్‌ ద్వారా వచ్చినట్టు విచారణలో చెప్పాడన్నారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అతని నుంచి రూ.2 లక్షల ఒరిజినల్‌ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరి వద్ద నుంచి మొత్తం రూ.4,97,500 దొంగనోట్లు, రూ.3.28 లక్షల ఒరిజినల్‌ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు