హత్య కేసులో నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష

15 Mar, 2017 21:01 IST|Sakshi
విజయనగరం: భార్యను హత మార్చాడన్న కేసులో అభియోగం రుజువు కావడంతో ఎస్‌.కోట మండలం మూలబొడ్డవర గ్రామానికి చెందిన సుకురు భీమరాజుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు బుధవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... భీమరాజు దొరపాలెం గ్రామానికి చెందిన అచ్చయ్యమ్మను పదహారేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారికి తులసీ అనే కుమార్తె ఉంది. సుమారు ఆరేళ్ల పాటు వారి వైవాహిక జీవితం సజావుగా సాగింది. అప్పటి నుంచి వ్యసనాలకు బానిసైన భీమరాజు తరచూ భార్యతో తగాదా పడేవాడు.
 
పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భార్యను వేధించ సాగాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2016 ఆగస్టు 26న ఇంటి సమీపంలో రోడ్డు మీద తన భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ మేరకు మృతురాలి సమీప బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి భీమరాజు ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాధారాలతో కేసు రుజువు చేసినందున న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ పి.అప్పలనాయుడు వాదించారు.
 
మరిన్ని వార్తలు