విశాఖలో చక్కటి వనరులు ఉన్నాయి: మంత్రి అవంతి

18 Feb, 2020 14:14 IST|Sakshi
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే వాతావరణం విశాఖలో ఉందని, ఇక్కడ చక్కటి వనరులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో యునైటేడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో మంత్రితో పాటు పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి కేవలం 48 గంటల్లో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక, ప్రచార ఆవశ్యకత, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నవీకరణ, పర్యావరణ వ్యవస్థ, వాణిజ్య తదితర అంశాలపై నేడు ఈ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

ఇక రేపు(బుధవారం) విశాఖలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉందని, వైఎస్సార్‌ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. 2024నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం ముందుంటుందన్నారు. ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ ప్రపంచ స్థాయి మహానగరంగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు