ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు

27 Sep, 2019 18:20 IST|Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, ఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు అందుకోవడం సంతోషకరంగా ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 28 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని.. పర్యాటకం అభివృద్ధి, ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. గుజరాత్ తర్వాత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి వెల్లడించారు. మారుమూల ప్రాంతాలకు సైతం పర్యాటక రంగాన్ని తీసుకెళ్లి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.

త్వరలోనే రాష్ట్రంలో టూరిజం సదస్సుని నిర్వహిస్తామని చెప్పారు. మౌలిక వసతులు, రవాణా, పర్యాటకుల భద్రత, స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించామన్నారు. విదేశీ పర్యాటకులు సంఖ్యను పెంచేందుకు వైజాగ్ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్‌కి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకుల భద్రత ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సీఎం జగన్‌ ఐదుగురి సభ్యులతో కమిటీ వేశారన్నారు. కమిటీ ఇచ్చే సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు..
పాపికొండల వద్ద గోదావరిలో మునిగిపోయిన బోట్‌ను వెలికితీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 24 గంటలు కష్టపడుతున్నారని మంత్రి అవంతి తెలిపారు. ‘చంద్రబాబు ఉంటే గంటలో తీస్తారు.. రెండు గంటల్లో తీసేవారని అంటున్నారని.. చంద్రబాబు ఏమన్నా స్విమ్మరా? డ్రైవరా రెండు గంటల్లో వెలికి తీయడానికి’ అని ఎద్దేవా చేశారు. ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చని.. బోట్‌ని వెలికితీసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. బోటు మునక ఘటన దురదృష్టకరమని.. దీనిపై రాజకీయాలు చేయడం దారుణన్నారు. బోటు టీడీపీ మద్దతుదారుడిదని, బోటుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు