ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్‌

17 Dec, 2019 14:02 IST|Sakshi

మండలిలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అనే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి  కురసాల కన్నబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గుంటూరు కేంద్రంగా నకిలీ దందా నడుస్తోందని,  దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ చేసిన దాడుల్లో రూ. 5.46 కోట్ల విలువైన కల్తీ యూరియాను సీజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. 1455 నమూనాలను పరీక్షించగా 35 నమూనాలు నాసిరకంగా తేలాయని తెలిపారు.  నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకున్నామని సభకు వివరించారు.

‘ఇకపై ప్రభుత్వ ల్యాబ్ లో నిర్ధారించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకే అనుమతి ఇస్తాం. ఆయా విక్రయ సంస్థలు ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల వద్దే అగ్రీ ఇన్ పుట్ షాప్ లను ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిల్యాబ్స్‌ ను ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్లు అంశంపై రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. అన్నా క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తల కోసమే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా వుందన్నారు. ‘ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే... అక్కడ క్యాంటీన్లు పెట్టారు. సబ్సిడీపై ఇచ్చే ఆహారం సామాన్యులకు, పేద ప్రజలకు దక్కలేదు. వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే 15 జిల్లా ఆసుపత్రులు, 28 ఏరియా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రుల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు