సీఎం జగన్‌ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్‌

14 Aug, 2019 14:14 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీల పక్షపాతి అని మరోసారి రుజువయిందని వైఎస్సార్‌సీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రస్తుతించారు. రంజాన్‌ పండగ రోజు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని.. బక్రీద్‌ పండుగ రోజు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింనందుకు ముస్లింలతో పాటు, తెలుగు రాష్ట్ర్రాల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓడిపోయిన వారిని కూడా ఆదరించి పదవులు ఇస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు ఓట్లు కోసం మాత్రమే ఎన్నికల ముందు మైనార్టీలకు పదవులు ఇచ్చారని విమర్శించారు.

వైఎస్‌ జగన్‌.. తండ్రిని మించిన తనయుడు: చల్లా రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చల్లా రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పది సంవత్సరాలు ప్రతి పక్షం, పాలకపక్షంలోనూ కలిసి పనిచేశానని తెలిపారు. తండ్రిని మించిన తనయుడు వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. ఎమ్మెల్సీగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ప్రజావాణి, ప్రభుత్వ ప్రాధాన్యతలను శాసనమండలిలో వినిపిస్తానని.. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు.

రాష్ట్ర్ర సమస్యలపై ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉంది: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాష్ట్ర్ర సమస్యలపై మహ్మద్‌ ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. విద్యావంతుడైన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు