తక్కువ పెట్టుబడితో అధిక లాభాలే లక్ష్యం

17 May, 2018 07:24 IST|Sakshi

పశ్చిమగోదావరి ,పెనుమంట్ర:  తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అనుకూల పరిస్థితులను రైతులకు అందించే లక్ష్యంతోనే పరిశోధనలు సాగుతున్నాయని గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టరు వల్లభనేని దామోదరనాయుడు అన్నారు. మార్టేరులోని వ్యవసాయ వరి పరిశోధనాస్థానంలో మూడు రోజుల పాటు జరగనున్న వ్యవసాయ తెగుళ్ల విభాగం శాస్త్రవేత్తల సాంకేతిక అధ్యయన, విశ్లేషణ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తరం తెగుళ్లతో పాటు మారుతున్న వాతావరణ నేపథ్యంలో సోకుతున్న తెగుళ్లపైనా విస్తృత పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు.

ఈ మేరకు రాష్ట్రస్థాయిలో తిరుపతి, అనకాపల్లి, గుంటూరులలో శాస్త్రవేత్తల సాంకేతిక విశ్లేషణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా విత్తు స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొలక దశ నుంచి పంట చేతికందే దశ వరకు కూడా తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. అందుకనే రైతు పొలాల్లోనే నాణ్యమైన విత్తనాల తయారీని తాము ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మార్టేరు పరిశోధనాస్థానం అధిపతి పాటూరి మునిరత్నం మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా కూడా తెగుళ్లను అరికట్టే నూతన విధానాలను ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పరిశోధనా సంచాలకులు ఎన్‌వీ నాయుడు, తెగుళ్ల నివారణా విభాగం సంచాలకులు సీపీడీ రాజన్, బోధనా సంచాలకులు డాక్టరు జె. కృష్ణప్రసాద్, పాలకమండలి సభ్యులు డాక్టరు గుబ్బల వెంకట నాగే«శ్వరరావు, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త మురళీధర్, మానుకొండ శ్రీనివాసరావు మాట్లాడారు. 13 జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వరి, ఉద్యాన పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తొలిరోజు చర్చించారు.

రూ.100 కోట్లతో నూతన భవన సముదాయం
గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు మౌలిక సదుపాయల కల్పనకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోందని విశ్వవిద్యాలయం ఉపకులపతి వి. దామోదర నాయుడు తెలిపారు. మార్టేరులో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ గుంటూరులో రూ.100 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న వివిధ స్థాయి శాస్త్రవేత్తల పోస్టుల నియామకం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. మార్టేరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలోనూ రూ.కోటితో కొత్త భవన నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా రూ.45 లక్షలతో మంచినీటి ట్యాంకు, రూ.21 లక్షలతో నిడదవోలు–నరసాపురం ప్రధాన కాల్వపై కాలిబాట వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు