ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కోర్టు తీవ్ర ఆగ్రహం

14 Nov, 2017 12:02 IST|Sakshi

   విచారణకు హాజరు కాకపోవడంపై మండిపాటు 

     తదుపరి విచారణకు హాజరై తీరాల్సిందేనని స్పష్టీకరణ  

     తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్, పబ్లిషర్‌ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ 17వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

అసెంబ్లీ సమావేశాలకు, వారికి సంబంధం ఏంటి?
ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ తదితరులను ఆదేశించింది.

అయితే, మంగళవారం నాటి విచారణకు వారు హాజరు కాకుండా తమ న్యాయవాది ద్వారా పిటిషన్‌ దాఖలు చేయించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము కోర్టు ముందు హాజరు కాలేపోతున్నామని అందులో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు, వీరికి ఏం సంబంధం ఉందంటూ ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ... ఫిర్యాదుదారు ఎమ్మెల్యే అని, ఆయనే న్యాయస్థానం ముందు హాజరు కాగా, అసెంబ్లీతో సంబంధం లేని వ్యక్తులు మాత్రం గైర్హాజరయ్యారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణకు వ్యక్తితంగా హాజరై తీరాలని రాధాకృష్ణ, శ్రీనివాస్, శేషగిరిరావు తదితరులకు తేల్చి చెప్పింది.   

మరిన్ని వార్తలు