మైనార్టీ సదస్సు పట్టని నేతలు

29 Aug, 2018 09:53 IST|Sakshi

అధికార పార్టీ నేతలు జనసమీకరణను తుస్‌ మనిపించారు. ‘నారా హమారా. టీడీపీ హమారా’ పేరుతో తెలుగుదేశం పార్టీ గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభకు జిల్లా నుంచి జనసమీకరణ చేయటంలో ముఖ్య నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పర్యావసానంగా వందల బస్సులు అని చెప్పి చివరకు పదుల సంఖ్యలో బస్సులు వెళ్లటం, దానిలో కూడా మైనార్టీలతో పాటు పార్టీ కార్యకర్తలు ఉండటం గమనార్హం. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైనార్టీ సదస్సుకు జిల్లా నుంచి జనసమీకరణ, ఇతర బాధ్యతలు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో, మైనార్టీ ఓటింగ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పర్యటించి అక్కడ సభ పోస్టర్‌ ఆవిష్కరణలు, సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వారం నుంచి సభకు తరలిరావాలని పిలుపునివ్వటంతో పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అయితే మంగళవారం మాత్రం ఆ మేరకు ఎక్కడా జనం కనిపించని పరిస్థితి.

జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ జనసమీకరణను పూర్తిగా గాలికొదిలేశారు. నెల్లూరు నగరం నుంచి  మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోవటం గమనార్హం. ఇక జిల్లాలో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మాత్రం అట్టహసంగా నగరం నుంచే వందకు పైగా బస్సులు, జిల్లా నుంచి 235 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. తీరా జనాలు లేకపోవటంతో 50 బస్సులు కూడా పూర్తిగా వెళ్లని పరిస్థితి. జిల్లాలో మైనార్టీల ఓటింగ్‌ గణనీయంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌లో అధికంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాలోనూ అధికంగా ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీల ఓటింగ్‌ ఉంది.

ఈ క్రమంలో జిల్లా నుంచి కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా సభకు తరలించాలని పార్టీ రాష్ట్ర నేతల ఆదేశం. అయితే ఈ మేరకు నేతలు ప్రకటనలు చేసి హడావుడి చేశారు కానీ మైనార్టీలను పూర్తిస్థాయిలో రప్పించలేకపోయారు. మంగళవారం ఉదయం నగరంలో వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో బస్సులను నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో సగం బస్సులు కూడా నిండని పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో బస్సులను డిపోలకు వెనక్కి పంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొన్ని బస్సులు కదలిని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ మైనార్టీ సదస్సుకు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం గమనార్హం.

మరిన్ని వార్తలు