మామిడి చెట్ల బీమాపై రైతులకు అవగాహన కరువు

13 Dec, 2013 00:29 IST|Sakshi

 బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :
 మామిడి రైతులకు ప్రయోజనం కలిగించే వాతావరణ ఆధారిత బీమా పథకంపై జిల్లాలో ప్రచారం కొరవడింది. బీమా పథకంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇన్సూరెన్స్ చెల్లించే గడువు కేవలం ఒక్కరోజే మిగిలి ఉన్నా.. ఇంత వరకు రైతులకు తెలియజెప్పే నాథుడే లేడు. దీంతో రైతులు మామిడి తోటలకు బీమా చేయించే పరిస్థితులు కనిపించడం లేదు. మామిడి తోటల పెంపకంలో జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచింది. జిల్లాలో సుమారు 22 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 15 వేల హెక్టార్లలో మామిడి తోటలు కాపు వస్తుండగా, మిగిలిన 7 హెక్టార్లలో ఐదేళ్లలోపు చెట్లు ఉన్నాయి. నెన్నెల, జైపూర్, తాండూర్, బెల్లంపల్లి, కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్, కడెం, ఖానాపూర్, దిలావర్‌పూర్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా మామిడి తోటలు సాగు చేశారు.
 
  ప్రకృతి వైపరీత్యం వల్ల ఏటా మామిడి చెట్లకు పూత సరిగా రాక, కాపు పడిపోతోంది. ఈ కారణంగా మామిడి తోటలపైనే ప్రధానంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా ఆ పథకాన్ని అమలు చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం దాని ప్రాధాన్యతను రైతులకు వివరించడం లేదు. గ్రామాల్లో ప్రచారం కూడా చేయడం లేదు. దీంతో రైతు లు మామిడి చెట్లకు బీమా చేయించలేకపోతున్నారు. ఆ పథకాన్ని విని యోగించుకోవడంలో మామిడి రైతులు ఇతర జిల్లాల రైతుల కన్న ఎంతో వెనుకబడిపోతున్నారు. ఈయేడు కూడా బీమా పథకాన్ని జిల్లాకు వర్తింపజేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ జీవో నం.1340ను జారీ చేసింది. ఈ నెల 14వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తుంది. ఇంత వరకు గ్రామాల్లో ఎక్కడా ప్రచారం చేయించలేదు. కనీసం ఏ ఒక్క రైతుకు కూడా తెలియజేసిన పాపాన పోలేదు.
 
 చెట్ల వయస్సును బట్టి బీమా..
 మామిడి చెట్లను రెండు రకాలుగా విభజించారు. సాధారణం గా ఐదేళ్ల వయస్సున్న చెట్లకు మామిడి పూత ఆపుతారు. అప్ప టి నుంచి కాపు ప్రారంభమవుతుంది. 5 నుంచి 15 ఏళ్ల వయ స్సు కలిగిన ఒక్కో మామిడి చెట్టుకు రూ.52 బీమా ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. అందులో మామిడి రైతు రూ. 26 ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం రూ.26 ప్రభుత్వం భరిస్తుంది. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన ఒక్కో చెట్టు కు రూ.92 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందు లో రూ.46 రైతులు ప్రీమియం కడితే మరో రూ.46 ప్రభుత్వం వాటా చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యంతో మామిడి కా పునకు నష్టం కలిగితే 5-15 ఏళ్ల చెట్టు ఒక్కంటికి రూ.450 చొప్పున, 16-50 ఏళ్లలోపు వయస్సు కలిగిన చెట్టుకు రూ. 800 చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది.
 
 అప్పు తీసుకున్న రైతులకు సైతం..
 పంట రుణాల కింద ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెం బర్ 15వ తేదీ వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న మా మిడి రైతులకు కూడా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని వర్తింపజేశారు. రుణాలు పొందని మామిడి రైతులు తుది గడువులోపు ఇన్సూరెన్స్ చెల్లించడానికి వీలు కల్పించారు. ఆసక్తిగల రైతులు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరు మీద నిర్ధేశించిన ప్రకారం బీమా ప్రీమియం డీడీ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు ఈ బీమాపై గతేడాది కూడా సరైన ప్రచారం చేయకపోవడంతో కేవలం 60 మంది మాత్రమే బీమా చేసినట్లు సమాచారం. అధికారులు మిన్నకుండిపోవడంతో ఇన్సూరెన్స్ పట్ల రైతులకు అవగాహన లేకుండా పోయిందనేది సత్యం.
 
 గట్లుంటదని మాకు తెల్వది
 మామిడి చెట్లకు సుత ఇన్సూరెన్స్ చేయిస్తారనేది మాకు తెల్వది. గట్ల ఎవలు సుత చెప్పలేదు. ఏటా గాలి వానకు పూత రాలిపోయి నట్టపోతున్నం. ఇన్సూరెన్స్ చేయిస్తేనన్న కొంత డబ్బు వచ్చేది. మా అసొంటోళ్లకు అధికారులు ఎందుకో గని తెలియజెప్తలేరు.
 - మొండక్క, మామిడి రైతు
 
 అధికారులు చెప్పలేదు
 మామిడి చెట్లకు ఇన్సూరెన్స్ చేయించాలనేది ఇంత వరకు మాకు అధికారులు చెప్పలేదు. ఏటా ఇట్లనే  జరుగుతంది. ఉద్యానవన అధికారులు రైతులకు ఇన్సూరెన్స్‌పై కనీస అవగాహన కూడా కల్పించడం లేదు. దీంతో ఇన్సూరెన్స్ చేయించలేకపోతున్నాం.
 - ఎండి ఆరీఫ్‌ఖాన్, మామిడి రైతు
 
 చెట్లతో లాభం లేదు
 ఎన్నో ఏళ్ల క్రితం మామిడి తోటలు పెట్టినం. ఎప్పుడు మాకు నష్టం అచ్చుడే తప్పా ఫాయిదా లేదు. మామిడి తోటలు పెంచుకొని ఎన్నో బాధలు పడుతున్నం. చెట్లకు ఇన్సూరెన్స్ ఉంటదని ఆల్లీల్లు అనుకొంగ ఇనుడేగాని సార్లచ్చి మాకు చెప్పింది లేదు. మేము చేయించింది లేదు.
 - పెద్ద శంకరయ్య , మామిడి రైతు
 

మరిన్ని వార్తలు