బాబోయ్.. డెంగీ!

16 Oct, 2015 01:16 IST|Sakshi

నివారణ చర్యలు శూన్యం
ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే
బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్స్ పేరుతో దోపిడీ
పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
 

విజయవాడ : మహాత్మాగాంధీ రోడ్డులోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన నారాయణమ్మకు జ్వరం వచ్చింది. తొలుత స్థానికంగా ఉన్న ఒక వైద్యునికి చూపించగా, వైరల్ జ్వరమని మందులిచ్చారు. రెండు రోజులకు పరిస్థితి విషమించగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిర్ధారణ పరీక్షలు చేసి డెంగీగా గుర్తించారు. అప్పటికే ప్లేట్‌లెట్స్ పడిపోయాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేక పోయారు. గత నెల మూడున మృతిచెందింది. ఇదే కాలనీలో పది మంది వరకు డెంగీ బారిన పడ్డారు.

శ్రీనగర్ కాలనీకి చెందిన చావా అనిల్‌కుమార్ (23) ఈ నెల 6న డెంగీతో మృత్యువాత పడ్డాడు. అతని కుటుంబం వీధిన పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందటంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయింది.

మురుగు, దుర్గంధంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, నగర పాలక సంస్థ వారిని వేడుకున్నా స్పందించకపోవడంతో నగరంలోని మధురానగర్, సింగ్‌నగర్, రామవరప్పాడు ప్రాంతాల్లో నిండు ప్రాణాలు బలయ్యాయి. డెంగీ మరింత వ్యాప్తి చెందుతోంది.

 జిల్లాలో వెయ్యి వరకు కేసులు
 జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా డెంగీ బారిన పడ్డారు. డెంగీ అనుమానిత జ్వరంతో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 983 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చేరగా, వారికి ఎలీసా టెస్ట్ నిర్వహించి 160 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వారిలో 28 మంది విజయవాడకు చెందిన వారే కావటం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రిలో ఇంతకు మూడు రెట్ల మంది చికిత్స పొందారు. ఆ లెక్కన డెంగీ బాధితుల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని చెపుతున్నారు. జిల్లాలో నాగాయలంక, చల్లపల్లి, తోట్లవల్లూరు. పెడన ప్రాంతాల నుంచి అత్యధికంగా డెంగీ బాధితులు నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు చెపుతున్నారు.

 ప్రభుత్వ చర్యలు శూన్యం
 జిల్లాలో డెంగీ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. సమీక్షలు జరపడం మినహా క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు లేవనే చెప్పాలి. అందుకు చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు ప్రాంతాల్లో ఇంకా జ్వరం కేసులు నమోదవడమే నిదర్శనం. కనీసం డెంగీ నిర్ధారణ కిట్లు సైతం ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి శాంపిల్స్ తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది.
 
ప్లేట్‌లెట్స్ దొరకని వైనం...

 జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్స్‌కు అనుమతులు లేకపోవడంతో ప్లేట్‌లెట్స్ కోసం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. డెంగీ జ్వరం తీవ్రత ఉన్న సమయంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ 30 వేల కన్నా తగ్గితే కృత్రిమంగా ఎక్కించాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో బ్యాగ్‌కు బ్లడ్ బ్యాంకుల్లో రూ.1200 నుంచి 1500 వరకు డబ్బు గుంజుతున్నారు. సింగిల్ డోనర్ నుంచి ప్లేట్‌లెట్స్ వేరు చేస్తే రూ.12 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రోగికి ఇద్దరి నుంచి ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తే రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. పదివేల కన్నా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండి, రక్తస్రావం అయ్యే పరిస్థితులు తలెత్తినప్పుడు త్వరగా కోలుకునేందుకు సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తుంటారు. అనుమతి పొందిన బ్లడ్‌బ్యాంకుల వారు మాత్రమే ఈ పద్ధతిలో ప్లేట్‌లెట్స్ వేరు చేయాల్సి ఉంది.
 
ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే...
జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరితే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని వ్యాధుల కంటే ఇప్పుడు జ్వరమే ప్రమాదకరంగా మారింది. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసిన వారు ఉన్నారు. డెంగీగా నిర్ధారించినవారికి వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూ సౌకర్యం లేక పోవడంతో రోగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు