మహాజన్ కుట్రదారు కాదు | Sakshi
Sakshi News home page

మహాజన్ కుట్రదారు కాదు

Published Fri, Oct 16 2015 8:40 AM

మహాజన్ కుట్రదారు కాదు

2జీ స్పెక్ట్రమ్ కేసులో కోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ: 2002 నాటి 2జీ స్పెక్ట్రం కేసులోకి మునుపటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని లాగాలన్న ప్రయత్నాలకు ప్రత్యేక కోర్టు చెక్‌పెట్టింది. నాటి టెలికం మంత్రి ప్రమోద్ మహాజన్, కార్యదర్శి శ్యామ్‌లాల్ ఘోష్‌లు కుట్రపన్ని అదనపు కేటాయింపుల ద్వారా ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలను నిరూపించడంలో సీబీఐ విఫలమైందని తేల్చిచెప్పింది. స్పెక్ట్రమ్ కేటాయింపులపై మహాజన్, ఘోష్‌లకు విభిన్న అభిప్రాయాలుండేవని, అలాంటప్పుడు వీరిని కుట్రదారులుగా ఎలా పేర్కొంటారని సీబీఐని నిలదీసింది.

ఈమేరకు కేసులో ఘోష్‌తోపాటు మరో మూడు టెలికం కంపెనీలు హచిసన్ మ్యాక్స్, స్టెర్లింగ్ సెల్యులార్, భారతి సెల్యులార్‌లపై నమోదుచేసిన అభియోగాలను ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి ఓపీ సైనీ కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు స్పెక్ట్రమ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి, కార్యదర్శి సమగ్రంగా చర్చించారని, ప్రైవేటు కంపెనీలకు ఉన్న అవసరాన్ని గుర్తించారని, ఆ సమయంలోనే తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టంచేసింది.

అలాంటప్పుడు నిర్ణయాన్ని ఏకపక్షంగా, హడావుడిగా తీసుకున్నారని ఎలా చెబుతారని సీబీఐని ప్రశ్నించింది. పూర్తిగా తప్పుడు అభియోగాలతో చార్జిషీట్‌ను పొందుపరిచి, కోర్టును తప్పుదోవ పట్టించాలని దర్యాప్తు సంస్థ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించాలని సీబీఐ డెరైక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఇదిలాఉండగా, వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్పెక్ట్రం కుంభకోణానికి పాల్పడిందంటూ మరకలంటించాలని కాంగ్రెస్ ప్రయత్నించినట్లు కోర్టు ఉత్తర్వులతో రుజువైందని బీజేపీ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement