కాలుష్య కోరల్లో పల్లెలు

16 Dec, 2013 01:05 IST|Sakshi

కొండాపూర్, న్యూస్‌లైన్:  పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. రాత్రివేళలో పరిశ్రమలు యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని గుంతపల్లి చౌరస్తాలో రెండు మినీ పరిశ్రమలున్నాయి. రెండు నెలల క్రితం మరో పరిశ్రమ కూడా ప్రారంభమైంది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు రాత్రి వేళలో యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేస్తున్నాయి. పాడైపోయిన వాహనాల టైర్లను అధిక మోతాదులో రాత్రింబవళ్లు కాల్చి అందులోని రసాయనాలను వెలికితీస్తారు.

రసాయనాలను ట్యాంకర్లలో హైదరాబాద్‌కు తరలిస్తారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులను సైతం పట్టించుకోవడం లేదు. వారు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా టైర్లను కాల్చగా ఏర్పడిన బుడిద పంటపొలాల్లో చేరడంతో పంటలు సైతం దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గుంతపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, ఎదురుగూడెం గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వాహనదారులు పరిశ్రమలు వదిలే విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  పరిశ్రమల తీరును నిరసిస్తూ గతంలో పరిశ్రమల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. యువజన సంఘాల నాయకులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. గ్రీవెన్స్‌డేలో భాగంగా కలెక్టర్ దృష్టికి విషవాయువుల పరిశ్రమలను మూసివేయాలని ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పరిశ్రమల యాజమాన్యాలను నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలుష్య కోరల నుంచి గ్రామాలను కాపాడాని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు