పోలవరం ఉనికికే ప్రమాదం

17 Mar, 2015 03:07 IST|Sakshi
పోలవరం ఉనికికే ప్రమాదం
  • అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
  • పట్టిసీమను అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి
  • రైతు సంఘాలు, ఇంజనీర్లదీ అదే మాట
  • జీతాలకు డబ్బుల్లేవంటూ 22 శాతం అధిక ధరతో ఎత్తిపోతలెందుకు?
  • సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టే విధంగా ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. టీడీపీ తప్ప రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టిసీమ ఎత్తిపోతలకు సానుకూలంగా లేవన్నారు. రైతు సంఘాలదీ అదే మాట అని, ఒక్క సంఘం కూడా పట్టిసీమ కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు సైతం పట్టిసీమ అక్కర్లేదని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

    ఇంతమంది వ్యతిరేకిస్తున్నా ఆగమేఘాల మీద పట్టిసీమకు పరిపాలనా అనుమతులు ఇచ్చారని విమర్శించారు. టెండర్లలో గూడుపుఠానీ చేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జీతాలకు డబ్బుల్లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి రోజూ చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో రూ.1,300 కోట్ల అంచనా వ్యయం ఉన్న పట్టిసీమను 22 శాతం అధిక ధరతో చేపట్టాల్సిన అవసరం ఏమిటి? అని ఆయన నిలదీశారు. సోమవారం శాసనసభలో నదుల అనుసంధానంపై 344 నిబంధన కింద జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

    కరువుతో రాష్ట్రం అల్లాడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నదుల అనుసంధానంపై చర్చించడాన్ని ఆయన స్వాగతించారు. కొన్ని ప్రాంతాల్లో పుష్కలంగా నీరు ఉండటం, కొన్ని ప్రాంతాలు కరువు, వరదలతో సతమతమవడం వంటి పరిస్థితులు శతాబ్దాలుగా చోటుచేసుకోవడం వల్ల రాష్ట్రంలో అసమతుల అభివృద్ధి జరిగిందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నదుల అనుసంధానం జరిగితే అన్ని ప్రాంతాలకు నీటి సమస్య తీరుతుందని, అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
     
    పోలవరం ద్వారా అనుసంధానం జరగాలి

    పోలవరం ప్రాజెక్టు ద్వారా అనుసంధానం జరగాలని, ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 1960లో కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య పోలవరం ప్రాజెక్టును  ప్రతిపాదిస్తే.. అనుమతులు రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టిందని గుర్తు చేశారు. తీరా అనుమతులు వచ్చి, జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చిన తర్వాత.. పట్టిసీమ పేరిట పోలవరం ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. రూ.16,010 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు రూ.4,000 కోట్లు, తర్వాత రూ.1,000 కోట్లు.. మొత్తం రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తే తెలుగువారి కల ఎప్పటికీ నెరవేరకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గత 9 సంవత్సరాల పాలనలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడాన్ని గుర్తు చేశారు. విశ్వేశ్వరరెడ్డి ప్రసంగం పూర్తికాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని మాట్లాడారు.
     
    ఎన్టీఆర్, నేనే ప్రాజెక్టులను ప్రారంభించాం: బాబు

    హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, తోటపల్లి, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులను ఎన్టీఆర్, తాను ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. వాటిని పూర్తి చేసేది కూడా తానేనని అన్నారు. ఎన్డీఏ-టీడీపీ హయాంలో పోలవరం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన ప్రాజెక్టులను తానే పూర్తి చేస్తున్నందువల్లే ప్రతిపక్షానికి అక్కసు అని నిందించారు. ప్రస్తుతం రూ.1,300 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపడితే, పోలవరం వచ్చే 4 సంవత్సరాల్లోగా రైతులకు నీళ్లివ్వడానికి అవకాశం ఉంటుందని, తద్వారా వారికి రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. అవినీతి విషయంలో తాను చండశాసనుడినని, నీతివంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు. పట్టిసీమ వల్ల గోదావరి జిల్లాలకు నష్టం జరగదన్నారు. ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లిస్తామంటే ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలకు 16.5 టీఎంసీల నీరిచ్చామని, ఫలితంగా 20 వేల బోర్‌బావులు రీచార్జ్ అయ్యాయని చెప్పారు. పులివెందులకు కూడా 2 టీఎంసీల నీరిచ్చి చీనీ చెట్లు కాపాడామన్నారు. చిత్తూరు జిల్లాలో 1,500 అడుగుల్లోనూ భూగర్భ జలాలు లభించడం లేదంటూ.. వచ్చే ఏడాది హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీరందిస్తామని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు