అక్టోబర్ టైర్రర్

11 Oct, 2014 03:10 IST|Sakshi
అక్టోబర్ టైర్రర్

కష్టాల తీరంలో సిక్కోలు విలవిల

* ప్రతి ఏటా తుపాన్ల దాడి.. తీవ్ర నష్టం
* ప్రస్తుత హుదూద్ దిశ మారితే జిల్లాకు కష్టమే
* ఇప్పటికే అల్లకల్లోలంగా సముద్రం
* ఎగిసిపడుతున్న అలలు
* ముందుకు చొచ్చుకొస్తున్న సాగరం
* కంటిమీద కునుకు కరువైన తీరగ్రామాలు

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాన్ల ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే సమయంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు పంటలను, ఆస్తులను ఊడ్చేస్తున్నాయి. ఫలితంగా జిల్లా ఆర్థికంగా చితికిపోతోంది. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో పెను విలయం సృష్టించిన పై-లీన్ తుపాను తొలుత కళింగపట్నం వద్దే తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే అది దిశ మార్చుకుని ఒడిశాలోని గోపాల్‌పూర్ వైపు మళ్లింది.

అదే విధంగా ప్రస్తుతం కమ్ముకొస్తున్న హుదూద్ తుపాను విశాఖ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా తీరం దాటే సమయంలో దిశ మార్చుకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వాస్తవానికి కోస్తా తీరంలో ఇప్పటివరకు 43 తుపాన్లు సంభవించినట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  తీరం దాటే సమయంలో ఇవి విధ్వంసం సృష్టిస్తుంటాయి. జిల్లాలోనూ పలు మార్లు తుపాన్లు తీరం దాటాయి.
 
వాస్తవానికి అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల కంటే బలహీనమైనవిగా వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్యం వచ్చే క్రమంలో తుపాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరో రెండు రోజుల్లో తీరం దాటనున్న హుదూద్ తుపాన్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న సిక్కోలు వాసులు గజగజలాడిపోతున్నారు.
 
తరుముకొస్తున్న హుదూద్
విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న తీవ్ర పెనుతుపాను శనివారం నుంచి జిల్లాపై ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోఆపటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.

ఇప్పటికే కళింగపట్నం పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుదూద్ ప్రభావం మరింత తీవ్రమైతే సమాచార వ్యవ స్థ కుప్పకూలడం ఖాయమని, పక్కా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు తిరిగి వచ్చేయాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, తీరం ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న జన్మభూమి సభలను రద్దు చేయడంతోపాటు విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.  తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు వాటిలో ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. 70 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఒక ఆర్మ్‌డ్ ఫోర్సు బృందం ఇప్పటికే జిల్లాకు  చేరుకున్నాయి.
 
నేటి నుంచి భారీ వర్షాలకు అవకాశం

పెను తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో శనివారం నుంచి భీకర గాలులతోపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కాగా శుక్రవారమే జిల్లాలో ఆకాశం మబ్బుపట్టింది. స్వల్పంగా గాలులు మొదలయ్యాయి.    కళింగపట్నం సహా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

మరిన్ని వార్తలు