జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Published Sat, Oct 11 2014 3:22 AM

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

వెంకటగిరిటౌన్/బుచ్చిరెడ్డిపాళెం:  జిల్లాను పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. డక్కిలి మండల పరిషత్ కార్యాలయ ఆవరణం, నెల్లూరు రూరల్ పరిధిలోని వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలే తమ పార్టీకి దక్కడంతో ఈ ప్రాంతంపై వివక్ష ఉందనే అపోహ ఉందన్నారు. ఇది నిజం కాదన్నారు.

వెంకటగిరి నియోజకవర్గంలోని సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టి సారిస్తానన్నారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు నిండితే నీటి కొరత ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోయిందన్నారు. అందుకే   కాంగ్రెస్‌ను ఓడించి ప్రజలు భూస్థాపితం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన ఒడిదుడుకుల మధ్య సాగుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చేశామన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు వస్తున్నామన్నారు.

అందుకు ఏడు గ్రిడ్‌లను ఏర్పాటు చేసినట్టు సీఎం చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో సాగే ఈ గ్రిడ్‌లతొ అభివృద్ధి పనులకు బంగారుబాటలు వేయనున్నామన్నారు. స్వగ్రామాలను స్వర్ణగ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇసుకరీచ్‌లో మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఇందులో వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని మహిళల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇది వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు. నీటి కొరతను అధిగమించేందుకు వాటర్‌గ్రిడ్ దోహదపడుతుందన్నారు. రూ.2 కే 20 లీటర్ల తాగునీటినిఅందించేందుకు సుజల స్రవంతి కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు.

గ్రామాలన్నింటికీ తారు రోడ్డు నిర్మించాలని ఉందన్నారు.  అనంతరం ఆయన ఐదుగురికి పింఛన్ అందజేశారు. గ్రామ సమాఖ్యకు రూ.50 కోట్లు, పట్టణ సమాఖ్యకు రూ.25 కోట్లకు సంబంధించి చెక్‌ను అందజేశారు. స్టాల్స్‌ను పరిశీలించారు. మహిళలకు సీమంతం చేశారు. మంత్రి నారాయణ, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి,  మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి , నాయకులు బీద రవిచంద్ర, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణిపాల్గొన్నారు.

Advertisement
Advertisement