వేసవి గట్టెక్కేనా..?

2 Mar, 2017 16:02 IST|Sakshi
వేసవి గట్టెక్కేనా..?

= సాగర్‌ డ్యాం నుంచి నేడో రేపో నిలిచిపోనున్న నీటి సరఫరా
= రెండువారాలుగా విడుదల చేస్తున్నా.. జిల్లాలో సగానికిపైగా చెరువులు ఖాళీ
= ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్‌ నీటిమట్ట 79.5 మీటర్లు
= వేసవిలో నీటి సమస్య నుంచి గట్టెక్కడం ప్రశ్నార్థకమే


చీమకుర్తి రూరల్‌: నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద జిల్లాకు సంబంధించిన కుడికాలువకు గురు, శుక్రవారాల నుంచి నీటి విడుదలను నిలిపివేయనున్నట్లుతెలిసింది. నిలిపివేసిన తర్వాత కూడా వారం రోజుల వరకు బుగ్గవాగు నుంచి రామతీర్థం రిజర్వాయర్‌కు సాగర్‌ జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండు వారాల నుంచి వస్తున్న సాగర్‌ నీటితో రామతీర్థం రిజర్వాయర్‌ ఇంకా పూర్తిగా నిండలేదు.

సాగర్‌ నుంచి  వచ్చిన నీటిని వచ్చినట్లు నోటిఫైడ్‌ చెరువులు, నాన్‌నోటిఫైడ్‌ చెరువులు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులకు అందిస్తున్నారు. అయినా గ్రామాల్లో ఇంకా సగానికిపైగా చెరువులు ఖాళీగా ఉన్నాయి. ఒంగోలు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌–1కు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌–2కు మాత్రమే గత ఆదివారం నుంచి రోజుకు 80 నుంచి 90 క్యూసెక్కుల చొప్పున సాగర్‌నీరు సరఫరా చేస్తున్నారు. రెండు ట్యాంకుల పూర్తిసామర్థ్యం 5,800 మిల్లీలీటర్లు కాగా, ప్రస్తుతం రెండింటిలో కలిపి 2,138 మిల్లీలీటర్లు మాత్రమే ఉంది. ఇంకా 3,660 మిల్లీలీటర్లు నింపుకోవాల్సి ఉంటుంది. రెండు ట్యాంకులు నింపడానికి రోజుకు 150 మిల్లీలీటర్ల చొప్పున విడుదల చేస్తే ఇంకా 25 రోజులు, 200 మిల్లీలీటర్ల చొప్పున ఇస్తే 18 రోజులు పడుతుందని పబ్లిక్‌ హెల్త్‌ డీఈ ప్రసాద్‌ తెలిపారు.

చీమకుర్తిలోని ఎస్‌ఎస్‌ ట్యాంకుకు కూడా సరిపడా నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్‌లోకి 340 క్యూసెక్కులు వస్తుండగా, రిజర్వాయర్‌ నుంచి బయటకు మాత్రం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా, ప్రస్తుతం 79.5 మీటర్లకు నీరు చేరింది. రానున్న వారం రోజుల వరకు మాత్రమే సాగర్‌నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు, రైతులు ముందు మిగిలిన చెరువులు, ఎస్‌ఎస్‌ ట్యాంకులు నింపుకుంటేనే వేసవి కాలం గట్టెక్కే అవకాశం ఉంది.లేకుంటే వేసవిలో నీటి తిప్పలు తప్పేలా లేవు.

 

మరిన్ని వార్తలు