వచ్చే వారం పీఆర్సీ నివేదిక

9 May, 2014 00:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదిక సిద్ధమైంది. ధరల సూచీ ఆధారంగా కమిషన్ 34 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్‌ను నిర్ధారించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఆర్సీ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో చైర్మన్ అగర్వాల్ వచ్చే వారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఈ నివేదికను సమర్పించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే ప్రధాన విధానపరమైన పీఆర్సీపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను నిర్ధారించాల్సి వస్తుంది. రాష్ట్ర విభజనకు నెల కూడా గడువు లేదు. ఈలోగా గవర్నర్ లేదా ఆయన సలహాదారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం సాధ్యం కాదనేది అధికారవర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే పీఆర్సీపై నిర్ణయాన్ని కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలకే వదిలేయాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొనే అవకాశాలు తక్కువని, దీనివల్ల పీఆర్సీ అమలు మరింత జాప్యమవుతుందని ఉద్యోగవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
 ఇదే పీఆర్సీని ఏ ప్రభుత్వమైనా అమలు చేయాలనుకుంటే గతంలో మంజూరు చేసిన ఐఆర్ 27 శాతానికి పైగానే ఫిట్‌మెంట్ బెనిఫిట్‌ను ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలోని పీఆర్సీ నివేదికను తామెందుకు అమలు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తే ఆ నివేదిక అటకెక్కుతుందనే అభిప్రాయం ఉద్యోగవర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటులోకి వెళ్లిపోతుందని, ఈ తరుణంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఫిట్‌మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు తొలుత పుష్కలంగానే ఉన్నప్పటికీ, ఇక్కడి ఉద్యోగులకు కేంద్ర సిబ్బందితో సమానంగా వేతనాలు ఇవ్వాలనుకుంటే పీఆర్సీ నివేదికను పక్కన పెడుతుందని, మరో కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందనేది ఉన్నతాధికారుల వాదన.

 

 

>
మరిన్ని వార్తలు