అంగట్లో బాల్యం

19 Nov, 2014 01:29 IST|Sakshi
అంగట్లో బాల్యం

ఏలూరు సిటీ :అది ఏలూరు రవాణా కార్యాలయం. దానికి కూతవేటు దూరంలో గుడారాలు. అందులో ఓ బృందం. వారిమధ్య ఓ బాలుడు. ఆ చిన్నారిని చూసిన ఓ అధికారి ఎక్కడినుంచి వచ్చావని ప్రశ్నించారు. బాలుడు నీళ్లు నమిలాడు. ఆ బృంద సభ్యులు కృష్ణాజిల్లా నూజివీడు నుంచి వచ్చిన వలస జీవులమని చెప్పుకున్నారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం అధికారులు అక్కడికెళ్లారు. ఆ బాలుడిని ప్రశ్నిం చారు. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తనను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని, తల్లిదండ్రులు లేరని చెప్పాడు.

మరో ఘటనలో.. నిడదవోలు రైల్వేస్టేషన్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ సూయిజ్ స్వయంగా ముగ్గురు బాలికలను పట్టుకున్నారు. ఇంకో వైపు కృష్ణాజిల్లానుంచి వచ్చిన ఆరు కుటుంబాల వారు చంటి బిడ్డలతో భిక్షాటన చేయిస్తున్నారు. బాలల సంక్షేమాధికారులు వారిని అదుపులోకి తీసుకోగానే ఓ ప్రజాప్రతినిధి వారిని వదిలేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. అధికారులు విస్తుపోయూరు. చేసేదేమీ లేక వారిని వదిలేశారు. ఇలాంటి వ్యవహారాల వెనుక ఓ ముష్టి మాఫియూ పనిచేస్తోందని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అధికారుల చొరవతో జిల్లాలో ఇప్పటివరకూ 41 భిక్షాటన కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిపై చర్యలు చేపట్టారు.

ఇదో మాఫియూ
కృష్ణాజిల్లా విజయవాడ నగరంలో ముష్టి మాఫియా వేళ్లూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాఫియా కార్యకలాపాలు పశ్చిమగోదావరి జిల్లాకూ విస్తరించటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పట్టణాలు, నగరాలపైనే ఈ మాఫియా దృష్టి కేంద్రీకరించింది. ప్రకాశం జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏలూరులో భిక్షాటన చేయించారు. సెప్టెంబర్‌లో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో పదిమందితో కూడిన భిక్షాటన బృందాన్ని బాలల సంరక్షణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉండికి చెందిన ఓ మహిళ చిన్నారితో భిక్షాటన చేరుుస్తూ పట్టుబడింది. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌లో ఇద్దరు పిల్లలతో భిక్షాటన చేయిస్తుండగా బాలల సంక్షేమ కోర్టు చైర్మన్ టీఎన్ స్నేహన్ పట్టుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అదేవిధంగా అరకు నుంచి వచ్చిన ఓ కుటుంబం పిల్లలను వదిలేసి పారిపోగా ఆ పిల్లలను తీగలవంచలోని కోళ్లఫారంలో పనికి పెట్టుకున్నారు. దాన్ని సాకుగా చూపించి కొందరు వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా జిల్లాలో అనేక ఘటనలు చోటు చేసుకోవటం ఆందోళనకు గురిచేస్తోంది.

పసి మొగ్గలను చిదిమేస్తున్నారు
చిన్నారులను రోడ్ల వెంబడి తిప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. కేవలం భిక్షాటనతోనే బాలలను వదిలేయకుండా అసాంఘిక కార్యకలాపాలకూ వాడుతున్నట్లు తెలుస్తోంది. మానసిక వికలాంగులను కూడా భిక్షాటనకు వినియోగిస్తున్నారని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటూ చంటిపిల్లలను చంకన బెట్టుకుని మరీ భిక్షాటన చేస్తున్నారు. ఏలూరులో 36కేసులు, కొయ్యిలగూడెంలో 16, నిడదవోలులో 8, గోపాలపురంలో 6, భీమవరంలో 6, తాడేపల్లిగూడెంలో 24, తణుకులో 2 ఇలా కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు బాలకార్మికులు 40మంది, అనాధలు 10మంది, వీధిబాలలు 32మంది, అ త్యాచారాలకు గురైన బాలికలు 74మంది, మానసిక వికలాంగులు 20మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు
బాలల న్యాయ చట్టంలోని సెక్షన్-24 ప్రకారం బాలలను భిక్షాటనకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్ని విచారిస్తే వీటి వెనుక మాఫియా ఉందనే అనుమానం వస్తోంది. కొందరు నాయకులు కూడా వారికోసం ఒత్తిడి తేవటం పరిస్థితికి అద్దం par పడుతోంది.ఙ- టీఎన్ స్నేహన్, చైర్మన్, జిల్లా బాలల కోర్టు

సామాజిక రుగ్మతే
విద్య, సామాజికపరంగా వెనుకబాటుకు గురైన వ్యక్తుల కుటుంబాల్లో ఎక్కువగా భిక్షాటన కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరమే. కొన్ని కేసులు పరిశీలిస్తే పిల్లలను వేధిస్తూ భిక్షాటన చేయిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు par తప్పవు.ఙ- పి.విజయనిర్మల, మేజిస్ట్రేట్;
బాలల సంక్షేమ కోర్టు

అవగాహన కల్పించాలి
జిల్లాలో అన్ని పట్టణాలతోపాటు ఏలూరు నగరంలోనూ బాలల సంరక్షణా బృంధాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారుు. వీధి బాలలు, అనాథలు, భిక్షాటన చేసే వారిని అదుపులోకి తీసుకుని సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నాం.
-  సీహెచ్.సూర్యచక్రవేణి,
జిల్లా బాలల రక్షణాధికారి
 

మరిన్ని వార్తలు