కదంతొక్కిన అంగన్‌వాడీ వర్కర్లు | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన అంగన్‌వాడీ వర్కర్లు

Published Wed, Nov 19 2014 1:24 AM

కదంతొక్కిన అంగన్‌వాడీ వర్కర్లు - Sakshi

సమస్యల పరిష్కారానికి వేలాదిగా తరలిన మహిళలు    
అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలన్న ఎమ్మెల్సీ నాగేశ్వర్
 
 హైదరాబాద్: తమకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడి ఉద్యోగులు కదంతొక్కారు. తెల్లరేషన్ కార్డులు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు కొనసాగించాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని కోరుతూ తెలంగాణ అంగన్‌వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన భారీ బహిరంగ సభకు అంగన్‌వాడి వర్కర్లు తరలివచ్చారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
 
 సభలో ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచుతున్నప్పుడు చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న అంగన్‌వాడీలకు జీతాలు పెంచితే తప్పేంటని ప్రశ్నిం చారు. అంగన్‌వాడీలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలంటే వీరికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎన్.భారతి, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, సీఐటీయూ అధ్యక్షుడు సీహెచ్ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో చర్చలు జరిపింది. అంగన్‌వాడీ కార్మికులకు రూ.4,200 నుంచి 15 వేలకు, హెల్పర్లకు రూ.2,200 నుంచి 12వేలకు వేతనాలు పెంచడానికి ప్రభుత్వానికి లేఖలు రాస్తామని ముఖ్యకార్యదర్శి హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు.

Advertisement
Advertisement