-

బ్రోకర్లదే రాజ్యం

28 Oct, 2015 01:16 IST|Sakshi

భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకం
రాజధాని గ్రామాల్లో ఎకరం రూ.1.50 కోట్లు
ఒకే చోట 5 ఎకరాలు దొరకడం కష్టమే
మళ్లీ పుంజుకుంటున్న రియల్ వ్యాపారం


విజయవాడ బ్యూరో : రాజధాని గ్రామాల్లో రియల్ బ్రోకర్లు మళ్లీ చక్రం తిప్పుతున్నారు. భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకంగా మారారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక కోర్ కేపిటల్ చుట్టుపక్కల గ్రామాల్లో మరోసారి రియల్ వ్యాపారం పుంజుకుంటోన్న దాఖలాలు కనిపిస్తున్న నేపథ్యంలో భూముల కొనుగోలు కోసం గ్రామాలకు వెళ్లిన కొనుగోలుదారులు బ్రోకర్లు లేకుండా భూములను కొనడం గగనమైంది. గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్ అవుతూ, భూములకు ధర నిర్ణయించడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. క్రయవిక్రయాల ద్వారా లక్షల్లో అందుతోన్న కమీషన్ డబ్బును నలుగురూ పంచుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ పనీపాటా లేకుండా వూరి సెంటరులో పేకాటతో కాలం వెళ్లబుచ్చే అప్పారావు రోజూ తుళ్లూరు, తాడికొండ వెళ్లి పీకల దాకా తాగి పొద్దుపోయాక ఎప్పటికో ఇల్లు చేరే పానకాలరావు వంటి సాధారణ వ్యక్తులు ప్రస్తుతం ఊరు కదలకుండా రియల్ బ్రోకర్ల అవతారమెత్తి లక్షలు సంపాదిస్తున్నారు.

 పడి లేచిన రియల్ వ్యాపారం
 రాజధానిలో రియల్ వ్యాపారం నెల రోజుల కిందటే సద్దుమణిగింది. నాలుగు నెలల కిందట ఎకరం భూమి ఖరీదు రూ.1.80 కోట్లకు చేరి, ఆ తరువాత సంక్షోభ సమయంలో రూ.80 లక్షలకు పడిపోయింది. భూముల కోసం కోట్లు వ్యయం చేసిన రియల్ వ్యాపారులు ఒక దశలో బాగా నష్టపోగా, కొంతమంది మాత్రం కొన్న భూములను మారు బేరానికి అమ్మి లాభ పడ్డారు. సీఆర్ డీఏ అనుమతులు, ఇతరత్రా నిబంధనలతో బేజారెత్తిన వ్యాపారులు ఆగస్టు నుంచి కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ప్రభుత్వం రాజధాని శంకుస్థాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి రాజధాని గ్రామాల్లో మళ్లీ రియల్ వ్యాపారం కాస్తంత పుంజుకుంది.

 కోర్ కేపిటల్‌లో ఊపు
 కోర్ కేపిటల్‌గా ప్రకటించిన ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చుట్టూ ఉన్న మందడం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల పరిధిలో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రియల్ వ్యాపారులు, పెట్రోలు బంకుల యజమానులు, బడాబడా వ్యాపారవేత్తలు ఎకరం నుంచి ఐదెకరాల వరకూ ఒకేచోట భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ గ్రామాల పరిధిలో ఎక్కడా ఒకే చోట రెండెకరాలకు మించి దొరకడం గగనమైంది. కేవలం అరెకరం, ముప్పాతిక, ఎకరం మేర పొలాలే అమ్మకాలకు దొరుకుతున్నాయి. ఈ వివరాలు కూడా కేవలం గ్రామాల్లో బ్రోకర్ల దగ్గరే దొరుకుతున్నాయి. గ్రామాల్లోని ఏఏ రైతులు తమ పొలాలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో వారికే తెల్సు. అటు కొన్నవారు, ఇటు అమ్మిన వారు సైతం కమీషన్లు ముట్టజెపుతుండటంతో బ్రోక ర్ల పంట పండుతోంది.

రాజధాని గ్రామాల్లో మొత్తం 53,747.46 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా, ఇందులో ప్రభుత్వ భూములు 15010.03 ఎకరాలు కాగా మిగతాదంతా (38737.49) ప్రైవేటు భూములే. ఇందులో 33,733 ఎకరాల మేర పట్టా భూములున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములు పోగా మిగతా భూములు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. గతంలో కొందరు రియల్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను కూడా ల్యాండ్‌పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదే మాదిరిగా కొనుగోలు చేసిన భూములను ల్యాండ్ పూలింగ్ కింద సర్కారుకు ఇచ్చి ఆపైన చేతికందే అభివృద్ధి చేసిన భూములతో లాభం పొందవచ్చనే ఆలోచన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సరికొత్త ఊపునిస్తోంది. ఈ తరహాలో యోచిస్తున్న వ్యాపారులే ప్రస్తుతం భూముల కొనుగోలు కోసం తిరుగుతున్నారు.

బడా బాబుల పేరు చెప్పి..: భూముల కొనుగోలు కోసం గ్రామాల్లో తిరిగే కొనుగోలుదారులతో బ్రోకర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రుల పేర్లతో పాటు ఇప్పటికే భూములు కొన్న ప్రముఖుల పేర్లు చెప్పి వారి పక్కనే ఉన్న భూముల విక్రయాలకు సిద్ధమవతున్నారు. మొదటి దశలో నిర్మాణం జరిగే రాజధాని ప్రాంతమిదేనంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. గ్రామానికో ఐదారుగురు బ్రోకర్లు తయారై రెవెన్యూ రికార్డులు, అందులోని భూములు, వాటి యజమానుల వివరాలను దగ్గరుంచుకుని తమదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు.
 

మరిన్ని వార్తలు