కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు | Sakshi
Sakshi News home page

కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు

Published Wed, Oct 28 2015 9:03 AM

కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు - Sakshi

(డేట్‌లైన్ హైదరాబాద్)
 
మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం.
 
 
అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లారనే వార్త విని సంతోషం పట్టలేకపోయానని ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక మీద పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సఖ్యంగా ఉంటే ప్రధాని నిజంగా సంతోషించవలసిందే. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ విభేదాలను, అహాన్ని పక్కన పెట్టి ప్రజోప యోగం కోసం కలసి పని చెయ్యాలనుకుంటే ప్రధానమంత్రే కాదు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలూ సంతోషిస్తారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ భుజం భుజం కలిపి నడిస్తే తెలుగు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారవుతారని ప్రధాని కూడా చెప్పారు.

చంద్రబాబు ఆహ్వానించడంతో కేసీఆర్ సహచరులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారట, శంకుస్థాపనకు తాను స్వయంగా వెళ్లడమా లేక మంత్రుల బృందాన్ని పంపడమా అని. ఆయనే హాజరైతే బాగుంటుందని అందరూ సూచించాక, అందుకు సిద్ధమై, తెలంగాణ నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకుని బయలు దేరారట. అయితే రాజధాని నిర్మాణానికి నిధులను గురించిన ప్రస్తావన ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కానీ, అటు ప్రధాని నుంచి కానీ రాకపోవ డంతో తెలంగాణ ముఖ్యమంత్రి తానెందుకు ఆ చొరవ చూపాలని మిన్న కుండిపోయారనీ, లాంఛనంగా అభినందనలతో ముగించారనీ టీఆర్‌ఎస్ ముఖ్యవర్గాలే చెబుతున్నాయి. నిజమే, నిర్మాణ భారం వహించవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ఇచ్చిన మాట మేరకు ఇతోధిక సాయం ప్రకటిం చాల్సిన కేంద్ర ప్రభుత్వానికీ పట్టనప్పుడు చంద్రశేఖర్‌రావు ఎందుకు అత్యు త్సాహం చూపించడం?

ఇదే ప్రధాని చూపిన స్వర్గం
గత సార్వత్రిక ఎన్నికలలో మోదీ, బాబు జోడీ కలసి పోటీ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత రాజధానిని నిర్మించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందలం ఎక్కిస్తామని వాగ్దానాలు చేశారు. కానీ అమరావతి శంకుస్థాపన నాడు ఆ అంశం జోలికి ఎందుకు వెళ్లలేదు? అంతకు ముందు దాదాపు రెండుమాసాల నుంచి టీడీపీ, బీజేపీ నాయకులు మీడియాలో ఊదరగొట్టారు, ‘ప్రధాని వస్త్తున్నారు, చూసు కోండి, ఏమేం తెస్తున్నారో!’ అని. ఓ జన్నత్ దిఖాయేగా (ఆయన స్వర్గం చూపిస్తాడు) అని. అవును, ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే స్వర్గం చూపించారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయం నుంచి స్వయంగా మట్టి తెచ్చారు. అది స్వర్గం నుంచి వచ్చినట్టే! మరో స్వర్గతుల్య మయిన యమునా పుణ్యజలాలను కూడా రాజధాని నిర్మాణంలో తమ వాటాగా అందించారు ప్రధాని. ఓ జన్నత్ ది ఖాయా అవుర్ జహాన్నూం మే పహుంచాయా (అరచేతిలో స్వర్గం చూపించి అడవిలో వదిలి వెళ్లాడు). శంకు స్థాపన ముగిశాక లెక్కకు మించిన హెలికాప్టర్‌లు ప్రముఖులను తీసుకుని గాలిలోకి ఎగరడంతో దుమ్ము పడ్డ కళ్లు నులుముకుంటూ ఇంటి దారి పట్టిన ఆ ప్రాంత రైతులు ఇదే గొణుక్కున్నారు. కార్యక్రమం ముగిశాక మామూలు మనుషులు కావడానికి టీడీపీ, బీజేపీ కూటమికి రెండు మూడురోజులే పట్టింది. చంద్రబాబు ఇరవై నాలుగు గంటల తరువాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రత్యేక హోదా అనబోయి, పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఇంత ముఖ్యమైన విషయంలో ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? ఎన్నో చేశారు అని ముఖ్యమంత్రి, అన్నీ చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం తప్ప బోలెడు ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత అట్టహాసంగా, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం నుంచి భవిష్యత్‌లోనయినా ఎలాంటి సాయం వస్తుంది అన్న అంశం మీద ఎవరికీ స్పష్టత రాలేదు.

ఆత్మార్పణల సంగతి తెలియదా?
ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన విషయం ప్రధాని దృష్టికి వచ్చింది కానీ, కేంద్రమే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుకు జరుగుతున్న ఆందోళనలు మాత్రం ఆయన దృష్టికి రాలేదు. ప్రత్యేక హోదా రాదేమో అన్న నిస్పృహతో కొందరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేయగల ఉద్యమం ఒకటి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్నదన్న విషయం, దాని కోసం ఆ అమరావతికి కూతవేటు దూరంలోనే ఒక పక్షం రోజుల ముందు ప్రతిపక్ష నేత నిరవధిక దీక్ష చేసిన విషయం ప్రధాని దృష్టికి రాష్ర్ట ప్రభుత్వం కానీ, కేంద్ర నిఘావర్గాలు కానీ, ఆయన పార్టీ యంత్రాంగం కానీ తీసుకుపోకపోవడం చిత్రమే.

కనీసం మీడియా ద్వారానైనా తెలిసి ఉండదా అంటే జాతీయ మీడియాకు ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ర్టం ఉన్నట్టు కానీ, అక్కడ ప్రత్యేక హోదా కోసం జీవన్మరణ పోరాటం జరుగుతున్నట్టు కానీ తెలిసినట్టే లేదు. తెలంగాణలో కవితమ్మ ఆధ్వర్యంలో ఆడించే బతుకమ్మలను చూడటానికీ, అమరావతిలో రాజధాని శంకుస్థాపన వేడుకలు చూడటానికీ పొలోమని రావడానికి తీరిక ఉన్న ఢిల్లీగత జీవులయిన జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం సాగుతున్న ఉద్యమం ఊసే పట్టకపోవడం విచారకరం.

మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించి సెంటిమెంట్‌తో కొట్టాలన్న పనికిరాని ఆలోచన ఇది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి రాజధాని ప్రాంతం అంతటా సర్వమత సమానత్వం పేరిట చర్చిల నుంచి, గురుద్వారాల నుంచి, మసీదుల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లు చల్లడం, దీనికో పవిత్రతను ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వాధినేతలే చేయడం రాజకీయ జిమ్మిక్కు అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు.

ముందున్నది ముసళ్ల పండుగ
ప్రత్యేకహోదా కావాలని ముఖ్యమంత్రి ఈ వేదిక మీద పట్టుపట్టనందుకు ప్రధాన మంత్రి మోదీ, రాజధాని నిర్మాణం ఎవరికి అప్పగించనున్నారు? లెక్కాపత్రం ఏమిటి అని ప్రధాని ప్రశ్నించనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి- ఇద్దరే ఆ ప్రాంగణం నుంచి సంతోషంగా తిరిగి వెళ్లారు. సంతో షంగా తిరిగి వెళ్లిన మూడో వ్యక్తి- తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను చూసి చేసిన హర్షధ్వానాలు, త్వరలో వస్తాయనుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రజల ఓట్లు తన పార్టీకి తెచ్చి పెడతాయనడానికి నిదర్శనమన్న సంబరం ఆయనది. అటు ప్రధానమంత్రికి కానీ, ఇటు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు కానీ ఇందులో సంతోషించాల్సింది ఏమీలేదు. ముందున్నది ముసళ్ల పండుగ. ఆయన పిలిచారు, మీరు వెళ్లారు బాగానే ఉంది. కాని ఓటుకు కోట్లు వ్యవహారం సంగతి ఏమిటి అని చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. అంతేకాదు, మీరు కూర్చున్న వేదిక మీద ప్రధాని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటునే వ్యతిరేకిస్తూ మాట్లాడితే మీరేం చేస్తున్నారు అని కూడా అడుగుతారు తెలంగాణ ప్రజలు. స్వార్థపరులు, రాజ కీయ స్వప్రయోజనాలు ఆశించిన వారూ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌ను చీల్చారు అని అమరావతి సాక్షిగా నరేంద్ర మోదీ మరొక్కమారు ప్రకటిం చారు. ఇది తెలంగాణ ఉద్యమ వీరుడు చంద్రశేఖర్‌రావు చెవులకు సోకలేదా?
 అమరావతి సందర్శన ప్రధానమంత్రికీ ఆయన పార్టీకీ రెండు రాష్ట్రా ల్లోనూ రెంటికీ చెడ్డ రేవడి అనుభవాన్ని మిగిలించే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన, రాష్ర్ట విభజనను పూర్తిగా సమర్థించిన భారతీయ జనతా పార్టీ విధానమూ, నరేంద్ర మోదీ విధానమూ వేర్వేరా అనే అభిప్రాయం కలుగుతున్నది.

ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారు అని రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరినే చాటుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తెలంగాణలోనూ, ప్రత్యేక హోదా సహా ఏ ప్రయోజనమూ అందించక ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ నాయకులు, శ్రేణులు ప్రజల్లో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకోవడం మాత్రం తథ్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ ఒత్తిడుల కారణంగా చేస్త్తున్నారో కానీ మొన్న అమరావతి వేదిక మీద మాట్లాడినప్పటి లాగానే కేంద్రాన్ని సమర్థిస్తూ పోతే విపరిణామాలు మరింత తీవ్రం కాకతప్పదు.

 

 

 

 

 

(వ్యాసకర్త: దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు)

Advertisement
Advertisement