పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్లు

20 Jul, 2014 02:12 IST|Sakshi
పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్లు

 ఏలూరు రూరల్ :జిల్లాలో రూ.10 కోట్లతో చేపట్టే పర్యాటక అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి పర్యాటక సర్య్కూట్, కొల్లేరు పర్యాటక సర్య్కూట్, దేవాలయాల పర్యాటక సర్య్కూట్‌లుగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొల్లేరు అందాలను పర్యాటకులు తిలకించేందుకు వీలుగా ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఆటపాక వరకూ టూరిస్ట్ బస్సు నడపాలన్నారు. కొల్లేరులో బోట్లు, కొత్తదనంతో కూడిన రిసార్ట్‌లు నిర్మించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, రిసార్టులు, బోటు షికారు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలను భక్తులే కాకుండా పర్యాటకులు కూడా దర్శించేలా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. వీటితోపాటు ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రవిసుభాష్, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, సెట్‌వెల్ సీఈవో సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా