అరకొరే..

10 Dec, 2014 02:45 IST|Sakshi
అరకొరే..

- రూ.40 వేలకు రూ. 220 మాత్రమే మాఫీ
- రూ 50 వేలలోపు ఉన్నా....వర్తించని పూర్తి మాఫీ
- అందరిదీ అదే ఆవేదన
- రుణమాఫీలో కన్పించని లక్షల రైతుల ఖాతాలు

సాక్షి, కడప : ఎన్నికల ప్రచారం నుంచి అధికారంలోకి వచ్చేవరకు ఒక తంతు... అక్కడి నుంచి అధికారంలో ఉన్న ఆరు నెలలు మరో తంతు.... ఇదిగో మాఫీ... అదిగో డబ్బులు అంటూ అదరగొట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించిన రుణ మాఫీ అర్హుల జాబితా చూసి రైతులు అవాక్కయ్యారు.

రూ.50 వేల లోపు రుణం ఉంటే మొత్తం ఒకేసారి మాఫీ చేస్తామన్న హామీ అనేక మంది రైతుల విషయం నిజం కాలేదు. అర్హత గుర్తింపు విషయంలోనూ అనేక అవకతవకలు వెలుగుచూసాయి. ఇదేమిటి అని ఎవరిని అడగాలో అర్థంకాని రైతులు బ్యాంకుల వద్ద బహిరంగంగానే తిట్టడం కనిపించింది. మొదటి విడతలో రూ.50 వేల రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేసి.... 50వేల పైన లక్షన్నర వరకు రుణం తీసుకున్న వారందరికీ ఐదు కంతుల్లో చెల్లిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు రైతుల ఖాతాలకు ఎంతోకొంత జమ చేసి చేతులు దులిపేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

రెండు రోజులుగా ఏ రైతును కదిపినా అంతా రుణమాఫీ గురించే చర్చ. నీకెంత పడిందంటే....నీకెంత మాఫీ అయిందనే దానిపైనే మాటలు సాగుతున్నారుు. లక్ష రూపాయలు పైబడిన రుణం తీసుకున్న వారిని పక్కన పెడితే రూ. 50 వేలు లోపు రుణం తీసుకున్న రైతుకు పూర్తిగా మాఫీ కాకపోవడంతో అయోమయం నెలకొంది. జిల్లాలో వందలాది మంది రైతులకు రూ. 50 వేల రుణ మాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. 2013-14 సంవత్సరానికి సంబంధించి 6,38,421 మంది రూ. 6063.19 కోట్ల రుణాలు తీసుకున్నారు.

ఆధార్, రేషన్‌కార్డులకు ప్రభుత్వం ముడిపెట్టిన కారణంగా రూ. 3,08,377 ఖాతాలు ఉన్న జాబితాలను బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ఇందులో రూ. 50 వేల లోపు, లక్షన్నర, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. ఈ ఖాతాలకు సంబంధించి ఇప్పటివరకు మొదటి విడతలో కేవలం రెండు లక్షల ఖాతాలలోపే రుణమాఫీ వర్తింపజేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఖాతాలకు రెండవ విడతలో అవకాశం ఉంటుందని పేర్కొంటున్నా.... వచ్చే వరకు నమ్మకం లేదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు లక్షకు పైగా ఖాతాలకు సంబంధించిన రైతులు రెండవ విడత కోసం ఎదురు చూస్తున్నారు.
 
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఓ తప్పుల తడకగా మారింది. కొంతమంది రైతులకు స్కేలు ఆఫ్ ఫైనాన్స్ రూ. 10వేలు.. మరికొంతమందికి రూ. 11వేలు.. ఇంకొందరికి రూ. 14వేలు రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా బ్యాంకులలో రుణాలు పొందిన రైతుల భూ విస్తీర్ణంలో కూడా భారీ వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి.

>
మరిన్ని వార్తలు