ఎస్పీ బదిలీ

17 Jul, 2014 02:30 IST|Sakshi

అనంతపురం క్రైం : జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లా ఎస్పీగాబదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు డీఐజీ కార్యాలయానికి చేరాయి. ఆయన స్థానంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న రాజశేఖర్ బాబును నియమించింది.
 
 ఆయన మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలోనే సెంథిల్‌ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈయన ఎనిమిది నెలల వ్యవధిలోనే బదిలీ కావడం గమనార్హం. ఈ స్వల్ప కాలంలోనే ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు. 2013 డిసెంబర్ 2న ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
 
 
 మునిసిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేశారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 9550707070 నంబరును అందుబాటులో ఉంచి.. ఆ కాల్స్‌ను స్వీకరించేందుకు క్యాంపు కార్యాలయంలో సిబ్బందిని నియమించారు. దీనికి అనుబంధంగా ‘వాట్సప్’ను, ‘పోలీస్ ఫేస్‌బుక్’ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ‘సన్నిహితం’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే సిబ్బందికి సరుకులు అందజేసేందుకు ప్రత్యేక స్టోర్  ఏర్పాటు, హోంగార్డులను వడ్డీ లేని రుణాలు ఇప్పించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం భవనాన్ని ఆధునికీకరణ, చిల్డ్రన్స్ పార్కు నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
 
 ప్రజల చెంతకు పోలీస్
 ‘అనంత’ వాసులకు సేవలందించేందుకు ‘ప్రజల చెంతకు పోలీసు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని వారిని కూడా పలకరించాలనే ఉద్దేశంతో ఒక్కో వారం ఒక్కో పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాల ప్రజలు సమస్యలు విని పరిష్కారానికి కృషి చేశారు.
 
 రాజశేఖర్‌బాబు.. పోలీస్ శాఖలో 1989వ బ్యాచ్ డీఎస్పీగా చేరారు. ధర్మవరం డీఎస్పీగా పని చేశారు.  2011లో ఐపీఎస్ పొందారు. స్టేట్ ఇంటలిజెన్స్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తూ 2012 నవంబరు 24వ తేదీన తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.  
 

మరిన్ని వార్తలు